
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును ఏమైనా చేస్తారమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావుకు హాని జరగొచ్చని ముందు నుంచి వైఎస్సార్ సీపీ చెప్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తనకు ప్రాణహాని ఉందని నిందితుడు చెబుతున్నాడు.. అతనికి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని థర్డ్ పార్టీతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
శ్రీనివాస్‌ను భుజాలపై మోసుకెళ్తున్నారని.. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. శ్రీనివాస్ వెనుకున్నది ఎవరో తెలియాలంటే.. అతని ఆరోగ్యం బాగుండాలని తెలిపారు. అవసరమైతే మరోసారి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ విషయాలను ఆయన వివరిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చిన్న విషయం కాదని పేర్కొన్నారు. శ్రీనివాసరావు ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. శ్రీనివాస్‌ను ఏమైనా చేస్తారనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, మంగళవారం వైద్య పరీక్షల కోసం పోలీసులు శ్రీనివాసరావును విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో అతను తనకు ప్రాణహాని ఉందంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment