సాక్షి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం వద్ద మట్టి దోపిడీకి నారాయణస్వామి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నారాయణస్వామి ఎవరు? అనే దానిపై ఆరా తీస్తే ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వరుసకు సోదరుడవుతాడంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరక్కుంటున్నారు. మంత్రి కనుసన్నల్లోనే తన బంధువులు, జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు రెండు రోజులుగా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇదంతా కనుసన్నల్లోనే..
అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం మంత్రికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రావెల చేసిన వ్యాఖ్యలతో ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందనే అనుమానాలకు బలం చేకూర్చింది. రావెల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి తన పేరు చెప్పుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
అధికారుల్లో చలనం ఏదీ?
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పుకొని నారాయణ స్వామి అనే వ్యక్తి మరికొందరితో కలిసి అటవీ భూములు, పోరంబోకు భూములు అనే తేడా లేకుండా మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అధికార టీడీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ వద్దకు వెళ్లి రెండు పొక్లెయిన్లు, రెండు లారీలను అధికారులకు పట్టించినప్పటికీ వారిలో చలనం లేకపోవడం చూస్తుంటే అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మట్టి దోపిడీకి పాల్పడుతున్న నారాయణస్వామి మంత్రి పుల్లారావుకు వరుసకు సోదరుడు అవుతాడనే దానిపై ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ నడుస్తుంది. సొంత బంధువుతోపాటు, తన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నప్పటికీ తనకేమీ తెలియదని మంత్రి పుల్లారావు బుకాయిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మంత్రి అండతోనే మట్టి దోపిడీ
అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అడ్డు పడుతున్నా లెక్కచేయకుండా మట్టి దోపిడీ చేస్తున్నారంటే మంత్రి అండలేనిదే ఈ స్థాయిలో రెచ్చిపోతారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎవరూ దీని జోలికి వెళ్లకపోవడం చూస్తుంటే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని అర్ధమవుతుంది. నిజంగా మంత్రికి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేకపోతే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్లు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న నారాయణస్వామితోపాటు, మరికొందరు టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిపోయి మాటలకే పరిమితం అవడం అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ సొంతపార్టీ నేతలనే ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రావెల డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.
Comments
Please login to add a commentAdd a comment