గజ్వేల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్: ‘మా ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తే కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు. ఒకరేమో అన్ని గంటలు కరెంటు ఒద్దంటుండ్రు, మరొకరేమో ఈ ఘనత అంతా మాదేనంటుండ్రు. వాళ్లది వాళ్లే ఆగమాగమైతుండ్రు. ఆ పార్టీ ప్రతిపక్ష నేత జానారెడ్డి పల్లెటూరు, పట్నంకు, రైతుకు నిరంతర కరెంటిస్తే విచిత్రమే.. అట్ల జేస్తే నేనే కేసీఆర్‌కు ముందుండి కార్యకర్తగా ప్రచారం చేస్తానని చెప్పిండు. మాటమీద నిలబడతారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహిం చిన టీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ‘సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నారు. తెలంగాణ తెస్తామని అనుకున్నది సాధించిండు.
ఇంటింటికీనల్లా నీళ్లు ఇస్తామని ఇచ్చి చూపించిండు. నిరంతర కరెంటు ఇస్తమని ఇయ్యాల ఆ కలను నిజం చేసిండు’అని అన్నారు. గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చెప్పి ఆ మాటనూ నెరవేరుస్తున్నారని తెలిపారు. గోదావరి నది పై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పదేళ్లు పడుతుందని, అలాంటిది రెండేళ్లలో పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. పనులు జరుగుతున్న తీరును సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్) సభ్యులు ప్రశంసించారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రక్రియ ప్రపంచంలోనే ఒక రికార్డుగా అభివర్ణించారు. ఇటీవల గజ్వేల్‌ను సందర్శించిన బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారని, హైదరాబాద్‌కు వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవణ్ణ గొల్ల కురుమల సంక్షేమానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను కొనియాడిన తీరును వివరించారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment