సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేస్తూనే.. ఇతర ప్రాంతాలకు సింగూరు జలాలను విడుదల చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించుకుపోతున్నారనే కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల విష ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై విపక్షాల విమర్శల నేపథ్యంలో హరీశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సింగూరు, ఘణపురం ఆయకట్టు రైతాంగం సాగు నీటి అవసరాలతో పాటు, జంట నగరాల తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరునిల్వ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో ఘణపురం ఆయకట్టు కోసం 4, సింగూరు ఆయకట్టుకు 2 టీఎంసీలతోపాటు తాగునీటి అవసరాలకు 2.50 టీఎంసీలు కేటా యించామని తెలిపారు. దీంతోపాటు ప్రాజెక్టులో మరో 7.50 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని మంత్రి పేర్కొ న్నారు. ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు పంటలకు సాగునీరందిం చిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగూరు కాలువలు, లిఫ్ట్ పనులు శరవేగంగా పూర్తి చేసి.. వరుసగా మూడో పంటకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.
విపక్షాలకు విమర్శించే హక్కు లేదు..
పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. గతంలో సింగూరు నుంచి నీటి విడుదల కోసం ఘణపురం ఆయకట్టు రైతులు హైదరాబాద్‌లో ఆందోళనలు చేసిన విషయా న్ని గుర్తు చేశారు. సింగూరు జలాలను ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేయాలని, లేదంటే పైపులైన్లు బద్దలు కొడతామంటూ ప్రకటించిన బీజేపీ ఆ తర్వాత ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నిం చారు. సింగూరుపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని, ప్రజలు ఆందోళనకు గురికా వద్దని హరీశ్ కోరారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఏనాడూ రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment