కురవి (మహబూబాబాద్ జిల్లా): ‘మీరంతా కలిసి ఉంటే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది. టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, సమిష్టిగా పని చేయాలి. ఐకమత్యం అవసరం. అందరూ కలిసి పని చేయాలి. ఇదే స్ఫూర్తి ఇకముందు కూడా కొనసాగించాలి. నాకెలాంటి అనుమానం లేదు. డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ మనకొస్తుంది’ అని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు.
‘కాళేశ్వరం పూర్తికాకముందే ఎసారెస్పీ స్టేజ్1, స్టేజ్2 పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రెండు దశలలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 440 కోట్లతో కాకతీయ ప్రధాన కాలువను ఆధునీకరిస్తున్నాం. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి నీరు పారిస్తాం. కాంగ్రెస్ హయాంలో ఎపుడూ ఎసారెస్పీని పట్టించుకోలేదు. మేడిగడ్డ దగ్గర 300 రోజులు నీళ్ల నిల్వ ఉంటాయి. కాళేశ్వరంలో ఒక రోజుకు 2 లక్షల సిమెంట్ బస్తాలు వాడుతున్నాం. ఇలాంటి భారీ ప్రాజెక్టు, ఇంత వేగంగా పనులు జరిగే ప్రాజెక్టు మరొకటి తాము చూడలేదని కేంద్ర జలసంఘం ప్రతినిధులు స్వయంగా కాళేశ్వరం పనులను చూసి ఆశ్చర్యపోయారు' అని హరీష్‌రావు తెలిపారు.
‘డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. చివరి భూములకూ నీరందేలా చూస్తున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకూ సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నడుం బిగించారు. కాళేశ్వరంతో ఎస్సారెస్పీని అనుసంధానంచేస్తున్నందున శ్రీరాంసాగర్ రెండో దశ పనులు పూర్తి చేస్తున్నాం. ఎల్‌ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లోని కాల్వల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండాచూస్తున్నాం. శ్రీరాంసాగర్ నీరు ఇప్పటిదాకా చూడని జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’ అని హరీశ్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment