వైరల్‌: ‘చంద్రబాబు ఆస్తులపై ట్రంప్‌ ఆరా..' | Minister Kannababu Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

వైరల్‌: ‘చంద్రబాబు ఆస్తులపై ట్రంప్‌ ఆరా..'

Published Tue, Feb 25 2020 6:09 PM | Last Updated on Tue, Feb 25 2020 8:48 PM

Minister Kannababu Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కాకినాడ:  భవిష్యత్‌పై భయంతోనే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని, దమ్ముంటే వైఎస్‌ జగన్‌ తొమ్మిది నెలల పాలనపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని మంత్రి కన్నబాబు సవాల్‌ విసిరారు. సీఎం వైఎస్‌ జగన్‌పై బురద జల్లడం కరెక్ట్‌ కాదని, ప్రజలు ఎప్పుడో చైతన్యవంతమయ్యారని, ప్రజా చైతన్యం అంటే ఏమిటో గత ఎన్నికల్లో చంద్రబాబుకు చూపెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఉక్రోషం, ఆవేదన దేనికోసమని ప్రశ్నించారు. సీఎం గురించి చంద్రబాబు దిగజారి మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇదేనా మీ రాజకీయ అనుభవమంటూ ప్రశ్నించారు.

కాకినాడలో మంగళవారం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించి.. అబద్ధాలు, అవాక్కులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టుమని పది మంది కూడా చంద్రబాబు మీటింగ్‌లో లేరు. టీవీలు ఎంతసేపు చంద్రబాబును మాత్రమే చూపించారు తప్ప జనాన్ని చూపించలేదు. ప్రజలు చైతన్యవంతమై టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తొలగించారు. ప్రజా చైతన్యమంటే ఏంటో చూపించారు. ఆ ప్రజా చైతన్యం ఎంత గట్టిగా ఉంటుందో అని చంద్రబాబుకు తగిలిన దెబ్బతో అర్థమైంది. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు రోడ్డెక్కారు. అసలు చంద్రబాబు ప్రజలను ఏమని చైతన్యపరుస్తారు?.

ఎక్కడైనా ప్రతిపక్ష పాత్రలో ఉన్నవారు అధికార పార్టీకి సమయం ఇస్తారు. అవసరమైతే సలహాలు, సూచనలు ఇస్తారు. ఎన్నికల సమయంలో వేడెక్కించేలా మాట్లాడుతారు. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్‌ జగన్‌పై బురద జల్లే కార్యక్రమానికి తెర లేపారు. లేనిది ఉన్నట్లు అబద్దాలు చెబుతున్నారు. ఇది నరకాసుర పరిపాలన అంటూ చంద్రబాబు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. తొమ్మిది నెలల్లో ఏం నరకాసుర పరిపాలన జరిగింది?. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇవ్వడం నరకాసుర పాలనా? రైతులకు పెట్టుబడి సాయం చేయడం తప్పా? ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులకు ఆర్థికసాయం చేయడం వల్ల నరకాసురుడయ్యారా? జగనన్న వసతి దీవెన, కంటి వెలుగు పేరుతో వైద్యం చేయిస్తే జగన్‌ నరకాసురుడు అయ్యారా? పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంటే నరకాసురుడు అయ్యాడా? లక్ష 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నరకాసురుడు అయ్యారా? అందుకే చంద్రబాబుకు మేం చెబుతున్నాం. రేపు జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో రండి.. చర్చిద్దాం. రోడ్డెక్కి సొంత మీడియా ఉందని అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదు. అవినీతిని నిర్మూలించవద్దా? మద్యం రేట్లు పెరిగితే బాధపడిన ఏకైన నాయకుడు చంద్రబాబు ఒక్కరే.   చదవండి: ఎవరికీ అన్యాయం జరగకూడదు: సీఎం జగన్‌

అమరావతిలో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. అమరావతిని మహానగరంగా నిర్మించినట్లు మాట్లాడుతున్నాడు. జోలె కట్టి ప్రజల నుంచి డబ్బులు లాక్కున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఓడిపోయాక ప్రజల వద్ద వసూలు చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్నది చంద్రబాబు స్వజన ఉద్యమం. ఆయన పార్టీ ఉనికి కోసం, ఆయనను నమ్ముకున్న వారి ఆస్తుల కోసం 29 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి నాలుగు గ్రామాల్లో ఉద్యమం నడుపుతున్నారు. నిన్న సభలో సీఎంను పట్టుకొని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకోవడం తప్పా?

ఉత్తరాంధ్రలోని విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలనుకోవడం తప్పా? కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ పెట్టాలనుకోవడం తప్పా? అమరావతిలో శాసన రాజధాని కొనసాగించాలనుకోవడం తప్పా? సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన తప్పేంటి? చంద్రబాబు ఓర్వలేక కుటుంబ సభ్యులతో సహా రోడ్డెక్కారు. ఆయన తనయుడికి రాజకీయ భవిష్యత్‌ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంది. వికేంద్రీకరణ జరిగి తీరుతుంది. అమరావతిలో మహా నగరాన్ని నిర్మించే ఆర్థిక స్థోమత ఈ రాష్ట్రానికి లేదు. ఆ రోజు శాసన మండలిలో ఈ బిల్లును అడ్డుకొని, చైర్మన్‌ను ప్రభావితం చేసేలా గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని ఎలా వ్యవహరించారో చూశాం. సిట్‌ వేస్తే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు.  చదవండి: ‘ప్రతిపక్షంలో కూడా అదే పనిచేస్తున్నారు’

ట్రంప్‌ ఆరా తీస్తున్నారంటూ సెటైర్స్‌:
రాష్ట్రంలో గత ఐదేళ్లలో అవినీతి జరిగితే వెలికి తీసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ట్రంప్‌ పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం లేదని చంద్రబాబు అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చూస్తున్నాం. ట్రంప్‌ విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా అని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. అమెరికాలో నన్ను ఓడిస్తానన్న చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారంటే జోలె పట్టుకొని తిరుగుతున్నారని సమాధానం చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని ట్రంప్‌ అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

వైఎస్‌ జగన్‌కు అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల చేతులు పట్టుకొని తిరగాలన్న కోరికలు ఏమీ లేవు. నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజల మనస్సుల్లో నిలిచిపోవాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ కోరిక. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఇండియాకు వస్తే పొలాలకు తీసుకెళ్లారు. ఇవాళ ట్రంప్‌ దేశానికి వస్తే రాష్ట్రపతికి ఉన్న క్రైటీరియా ప్రకారం 8 మంది సీఎంలను మాత్రమే పిలిచారు. ఇది చంద్రబాబుకు తప్పుగా కనిపించింది.

చంద్రబాబును వైఎస్‌ జగన్‌ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చి ఉంటుందంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా? ఇదే ట్రంప్‌ను ఓడిస్తానని చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ట్రంప్‌ గెలిచాడు. వైఎస్‌ జగన్‌ను ఓడిస్తానని రాష్ట్రమంతా తిరిగితే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. దేశమంతా చంద్రబాబు తిరిగి మోదీని ఓడిస్తానన్నారు. చంద్రబాబును జనం ఎక్కడ కూర్చోబెట్టారో మనం చూశాం. ఇప్పుడేమో మోదీతో గొడవ పెట్టుకొని తప్పు చేశామని అంటున్నాడు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి వలస పంపించారు. ఇదేం రాజకీయమో అర్థం కావడం లేదు. ఇంత దారుణంగా నాయకులు ఉంటారా అని ఆవేదనగా ఉంది. వైఎస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు వణుకు పుడుతుంది. యువకుడు 50 శాతం ఓట్లు సాధించడం ఏంటని భయపడుతున్నారు. ఇదే సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే భవిష్యత్‌ ఉండదని చంద్రబాబు వణికిపోతున్నారు.  చదవండి: ‘పెప్పర్‌ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదిలారు’

తాజాగా వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై పడ్డారు. వాలంటీర్లు అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను కించపరిచినట్లు కాదా?  ఇదే వాలంటీర్లుగా జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారు. మాట్లాడే ముందు కొంచెం సృహతో మాట్లాడాలి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ప్రయోగం దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది. ఈ రోజు కర్ణాటక, జార్ఖండ్‌ లాంటి రాష్ట్రాలు ఈ ఆలోచనలు చేస్తున్నాయి. దిశ చట్టం గురించి ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సమాచారం కోరుతున్నాయి. రైతు భరోసాపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. దేశమంతా వైఎస్‌ జగన్‌ వైపు చూస్తోంది. ఇవన్నీ బయటకు కనిపించకూడదని వైఎస్‌ జగన్‌పై బురద జల్లే కార్యక్రమాలు చంద్రబాబు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇవాళ రాజధాని రైతులకు వైఎస్‌ జగన్‌ మేలు చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రెస్టేషన్‌ నుంచి బయటకు వచ్చి చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని మంత్రి కన్నబాబు చంద్రబాబుకు సవాలు విసిరారు. రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్లు బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మరోసారి మీకు తగిన బుద్ధి చెబుతార’ని కన్నబాబు హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement