సాక్షి, చిలకలూరిపేట: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన అగ్రిగోల్డ్ భూముల విషయంలో మంత్రి భార్య ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ యథేచ్ఛగా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. మంత్రి స్థాయిలో ఉండి అగ్రిగోల్డ్ బాధితుల భూములను కొనుగోలు చేయటమే ఒక తప్పు అయితే, ఆ భూముల అమ్మకానికి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయటం మరోతప్పు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నుంచి ఆదేశాలు వస్తే చాలు తప్పో.. ఒప్పో అనవసరం నిబంధనలను పక్కన పెట్టి మరీ అధికారులు పనులు పూర్తి చేశారు.
అయితే ఇక్కడ మరొక అడుగు ముందుకు వేసి మంత్రి సతీమణికి పాసుపుస్తకం కావాలంటే ఏకంగా దొంగపాసు పుస్తకం తయారు చేసి ఇచ్చేశారు. ఈ పాసుపుస్తకం అధారంగానే రూ.కోట్లు విలువైన భూముల విక్రయాలు కొనసాగాయి. ఫోర్జరీకి పాల్పడిన మంత్రి సతీమణి ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మపై చర్యలు తీసుకోవాలని ఈనెల 23న ఏపీఎస్‌ఆర్‌టీసీ శాతవాహన రీజియన్ మాజీ చైర్మన్ మల్లాది శివన్నారాయణ ఆధారాలతో సహా అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్రమ కొనుగోళ్లు ఇలా..
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో మంత్రి పుల్లారావు సతీమణి అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారు. భర్త మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన కనుకొల్లు ఉదయదినకర్ వద్ద నుంచి గురిజేపల్లి గ్రామ సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 105/5, 104/6, 103/2లలో మొత్తం ఆరు ఎకరాల 19 సెంట్లు సేల్‌డీడ్ నంబర్ 423/15తో 2015 జనవరి 19న కొనుగోలు చేశారు. దీంతో పాటు ఉదయదినకర్‌కు బినామీగా ఉన్న ప్రగడ విజయకుమార్ వద్ద నుంచి సర్వే నంబర్ 104/1, 104/2, 104/3లలో మరో రెండు ఎకరాల 61 సెంట్లు సేల్‌డీడ్ నంబర్ 2851తో 2015 ఏప్రిల్ 17న, సర్వే నంబర్ 104/4లో మరో 57 సెంట్లు సేల్‌డీడ్ నంబర్ 2850/2015న కొనుగోలు చేశారు. వీటితో పాటు సర్వే నంబర్ 101/1లో ఐదు ఎకరాల 44 సెంట్ల భూమిని బండ శ్రీనివాసబాబు నుంచి సేల్‌డీడ్ నంబర్ 2852/15 తో అదే రోజు కొనుగోలు చేశారు. ఇందుకోసం పాసుపుస్తకం నంబర్ 246275 పేరుతో టైటిల్ డీడ్, పట్టాదారు పాసుపుస్తకం తయారైంది.
తక్కువకు కొని..
2015 జనవరి, ఏప్రిల్ మాసాల్లో కనుకొల్లు ఉదయదినకర్, మరో ఇద్దరి నుంచి ఎకరా రూ.20 లక్షల చొప్పున మొత్తం 14.81 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ వెంచర్లు వేసేందుకు ఈ భూములను అంతకుముందు కొనుగోలు చేసినప్పటికీ అప్పటికే సంస్థ వివాదాల్లో ఇరుక్కోవడంతో గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేసేందుకు ఇతరుల నుంచి అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మంత్రివర్యులు తన పలుకుబడి ఉపయోగించి ఈ భూములను బెదిరించి చౌకగా కొనుగోలు చేసినట్లు తదుపరి పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ మొత్తం 14.81 ఎకరాల భూమిని 2015 జూన్ 4న ఎకరా రూ.52 లక్షల చొప్పున కామేపల్లి లక్ష్మీప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు అనే ఇద్దరికి విక్రయాలు చేశారు. దీంతో మంత్రి కుటుంబానికి ఈ వ్యవహారంలో కోట్ల లబ్ధి చేకూరింది.
సంతకాలు ఫోర్జరీ..
గతంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరులో పనిచేసి వెళ్లిన తహసీల్దార్ శామ్యూల్ వరప్రసాద్ సంతకంతో పాసు పుస్తకాన్ని తయారు చేశారు. ఇందులో ఎక్కడా అధికారుల సంతకాల వద్ద కనీసం తేదీ లేదు. దీంతో పాటు వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేశారు. మంత్రి సతీమణికి రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాసుపుస్తకంలో వ్యవసాయదారుని సంతకం వద్ద మంత్రి సతీమణి సంతకం ఉండాల్సి పోయి గతంలో పొలం అమ్మిన ఉదయ్ దినకర్ సంతకం ఉండటం గమనార్హం.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్ని కాగితాలూ పకడ్బందీగా చూసి రిజిస్ట్రేషన్ జరపవలసిన సబ్ రిజిస్ట్రార్.. వ్యవసాయదారుని సంతకం చూడకుండా రిజిస్ట్రేషన్ జరిపించటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మంత్రికి రిజిస్ట్రేషన్ చేసిన ఉదయ్‌దినకర్‌కు చెందిన పాసుపుస్తకాల ఖాతా నంబర్ 525.. మంత్రి సతీమణికి ఇచ్చిన పాసుపుస్తకాల ఖాతా నంబరు కూడా 525 కావటం గమనార్హం. మంత్రి సతీమణికి జారీచేసిన పాసుపుస్తకాలు చేతిరాతతో రాసిఉన్నాయి.
ప్రస్తుతం పాసుపుస్తకాలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ప్రింట్ చేసి ఇస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీవో సంతకాలు కూడా డిజిటల్ సిగ్నేచర్‌తో వస్తున్నాయి. కానీ ఈ పాసుపుస్తకాలపై అధికారులు చేతి రాతతో సంతకాలు పెట్టినట్టు ఉన్నాయి. పట్టాదారు పాసుపుస్తకాలపైన మంత్రి సతీమణి ఫొటో వద్ద ఉన్న తహసీల్దార్ సంతకం, కింద తహసీల్దార్ సంతకం వేర్వేరు కావటం పాసు పుస్తకాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
దొంగలెవరు?
పాసు పుస్తకం సామాన్యులకు దొరకటానికి ప్రస్తుతం సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ భూములు కొనుగోలు చేసిన కొన్ని రోజుల్లోనే పట్టాదారు పాసుపుస్తకం తయారు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాసు పుస్తకం ఎక్కడ తయారైంది? పాసుపుస్తకం తయారు కావడానికి సహకరించిన వ్యక్తులు ఎవరు? తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా బయట వ్యక్తులు నకిలీ పాసుపుస్తకం తయారు చేశారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది.
బాధ్యులెవరు?
తన భూముల విక్రయానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా నకిలీ పాసుపుస్తకాలను వినియోగించడం పెద్ద నేరం. గతంలో పల్నాడు కేంద్రంగా జరిగిన పలు నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో పలువురు వీఆర్వోలను, వ్యక్తులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి వీరిని ఆశ్రయించి, తన భార్యపేరుపై నకిలీ పాసు పుస్తకాన్ని సృష్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్రయ సమయంలోనూ చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ పూర్తి స్థాయిలో పాసుపుస్తకాన్ని పరిశీలించకుండా మంత్రి ఆదేశాలతో పని కానివ్వడంతో కోట్లాది రూపాయల విలువైన విక్రయాలు కొనసాగాయని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మంత్రిగా ఉండి కూడా నకిలీ పాసుపుస్తకాన్ని ఉపయోగించి ఆస్తుల విక్రయానికి పాల్పడిన మంత్రే ప్రథమ నిందితుడని, ఈ విషయంలో లోతైన, నిష్పక్షపాతమైన విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment