సాక్షి, అమరావతి : శాసన మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్ ఫొటోలు తీశారని, శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదని అన్నారు. ఫొటోలు తియోద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెప్పారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి నారా లోకేష్ ప్రోద్బలమే కారణమన్నారు. టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యల తీరుతో మండలికి వెళ్లాలంటేనే బాధేస్తోందని పేర్కొన్నారు. ( ‘ఆయనకు టీడీపీ క్షమాపణ చెప్పాలి’ )
తమపై దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలచేత తిరస్కరించబడిన లోకేష్.. మండలిలో వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరతామన్నారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించరాదని అన్నారు.
ప్రజలకు మేలు జరగకూడదనే..
ప్రజలకు మేలు జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే టీడీపీ ఎమ్మెల్సీలు బిల్లులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చర్చించని టీడీపీ.. మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకుంటున్నారు. మండలిలో అంగబలం ఉంది.. సంగతి చూస్తామంటున్నట్టు టీడీపీ వ్యవహరించింది. మండలి ఛైర్మన్ గతంలో రూల్సుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఛైర్మన్ స్థానంలో కూర్చుని డిప్యూటీ ఛైర్మన్ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. గన్ మెన్లను తొలగించారంటూ డిప్యూటీ ఛైర్మన్ చైరులో కూర్చొని కామెంట్లు చేయడం సరి కాదు. చైరులో కూర్చున్న డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం టీడీపీ వాళ్లని మా వాళ్లని సంబోధిస్తున్నారు. రూల్ 90 కింద చర్చకు అడ్మిట్ చేయకుండానే యనమల మాట్లాడేశారు. తాను చర్చకు అనుమతించ లేదని మండలి ఛైర్మన్ కూడా స్పష్టంగా చెప్పారు. డిమాండ్ల మీద మంత్రులే సమాధానం చెప్పాలి కాబట్టి మండలికి వెళ్లాం. బిల్లులను కొన్నాళ్ల పాటు ఆపి శునకానందం పొందగలరు తప్ప.. లాభం ఏముంటుంది..?. ప్రజల కోసం మేం భరిస్తున్నాం.. మేం తిరగబడితే తట్టుకోలేరు.
బిల్లు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు
శాసనమండలిలో బిల్లులు అడ్డుకుంటామని యనమల ముందే చెప్పారు. చంద్రబాబు వ్యవహార శైలి శాసనసభలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉంటుంది. అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. సంఖ్యా బలం ఉందని మాత్రమే మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారు. మండలిలో డిప్యూటీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం. ఛైర్మన్ స్థానంలో ఉన్నప్పుడు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలి. దొడ్డిదారిన యనమల తెచ్చిన రూల్ 90 నోటీసును చర్చకు అనుమతించారు. యనమల ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణలో అరెస్టైన నేతలు మాకు నీతులు చెప్తున్నారు.
వీర సైనికుడు సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు..
లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ త్యాగాన్ని దేశం మరవదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ గొప్ప వ్యక్తి. శాసనసభ కూడా సంతోష్‌కు ఘనంగా నివాళులు అర్పించింది. సంతోష్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
Comments
Please login to add a commentAdd a comment