రాజధాని అని అంతా అన్యాయం చేశారయ్యా.. | Mla Alla Ramakrishna Reddy Conduct Meeting About Amaravathi Capital Land Pooling | Sakshi
Sakshi News home page

రాజధాని అని అంతా అన్యాయం చేశారయ్యా..

Published Thu, Jun 20 2019 11:00 AM | Last Updated on Thu, Jun 20 2019 11:03 AM

Mla Alla Ramakrishna Reddy Conduct Meeting About Amaravathi Capital Land Pooling  - Sakshi

పచ్చని పారాణి పూసుకుని కొత్త పెళ్లికూతురి వలే కళకళలాడే పంట భూములు .. బీడు వారి చిల్ల చెట్లు కప్పుకుని ఉంటే ఆ రైతుల గుండెలు చెరువయ్యాయి. మూడు పూటలా నాలుగు మెతుకులు పెట్టే భూములను బలవంతంగా లాక్కుంటే ఆ రైతుల జీవితాల్లో దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. తమ భూములు రాజధాని పేరుతో సాగించే దోపిడీకి ఇవ్వబోమని తెగేసి చెబుదామంటే అప్పటి టీడీపీ నేతల బెదిరింపులు గొంతు నొక్కేశాయి. ఇలా ఐదేళ్లపాటు కష్టాలను పంటి బిగువున దాచుకుని కాలం వెళ్లదీశారు రాజధాని రైతులు. బుధవారం రైతు సంక్షేమ ప్రభుత్వ వారథులుగా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తుళ్లూరు మండలం రాయపూడి వచ్చారు. రైతులను పలకరించగానే వారి గుండెల్లో పొంగిన వేదనలన్నీ కన్నీటి ప్రవాహమయ్యాయి. రాజధానిలో అంతా అన్యాయం చేశారయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా బెదిరించి భూములు లాక్కున్నారని వాపోయారు. విచారించి న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్యేలు భరోసా కల్పించారు.  

సాక్షి, అమరావతి : అమరావతి నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం చేసిన అవినీతిని త్వరలోనే బట్టబయలు చేస్తామని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో మల్లెల హరీంద్రనాథ్‌చౌదరి నివాసంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు, భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్న రైతులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

రాజధానికి భూములు ఇవ్వాలని బలవంతపెట్టారని, భూములు ఇవ్వకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొని స్వచ్ఛందంగా ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు అందకుండా చేశారని, విద్యుత్‌ సర్వీసులను తొలగించారని, సబ్సిడీలు రాకుండా అడ్డుకున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. భూములు తీసుకున్న తర్వాత ప్లాట్లు కేటాయించే సమయంలో టీడీపీ నాయకులు పాల్పడిన కుంభకోణాలను కూడా ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు. రాయపూడి గ్రామానికి చెందిన కస్తాలదిబ్బ, రూతమ్మ దిబ్బ, లంక భూములు సాగు చేసుకునే రైతులను దగా చేశారని వాపోయారు. విజయవాడకు చెందిన దళారితో కలసి స్థానిక సీఆర్‌డీఏ అధికారులు ఏవిధంగా తమ భూములు ఆక్రమించుకున్నారో వివరించారు. 

బలవంతంగా లాక్కునేందుకు యత్నం 
లింగాయపాలకెం, తాళ్లాయిపాలెం, వెంకటపాలెం లంక రైతులు మాట్లాడుతూ తమ భూములను గత ప్రభుత్వం అన్యాక్రాంతం చేయాలని యత్నించిందని, మా భూములను ప్రభుత్వ భూములుగా పరిగణించి బలవంతంగా లాక్కునేందుకు సీఆర్‌డీఏ అధికారులు తీవ్రంగా యత్నించారని తెలిపారు. తమవి జరీబు భూములైతే మెట్టగా పరిగణించి ప్యాకేజీ తగ్గించి ఇచ్చారని బోరుపాలెం, అబ్బరాజుపాలెం రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. 

అవినీతిని బయటపెడతాం 
అనంతరం ఎమ్మెల్యేలు ఆర్కే, శ్రీదేవి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతికి అడ్డూఅదుపులేదని పేర్కొన్నారు. వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీసిందని విమర్శించారు. దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్, సీలింగ్, లంక భూములను కారుచౌకగా తీసుకునేందుకు ప్రయత్నించిందన్నారు. ప్యాకేజీ విషయంలో తీవ్ర వివక్ష చూపించిందని చెప్పారు. భూములు ఇవ్వని రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

అవసరమైతే సీబీఐ విచారణ 
రాజధానిలో భూకొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, టీడీపీ నాయకులు పాల్పడిన భూ కుంభకోణాలపై అవసరమైతే సీబీఐ విచారణ కోరతామని ఎమ్మెల్యేలు తెలిపారు. దళితులు ఆర్థికంగా బలోపేతమవడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. స్విస్‌ చాలెంజ్‌ పేరుతో రైతుల భూములను సింగపూర్‌ కంపెనీలకు అప్పగించారని, ఈ ఒప్పందాలను సమీక్షించి అవసరమైతే కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు తెలిపిన సమస్యలను సీఆర్‌డీఏ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపుతామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.

దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
సహజ వనరులను నాశనం చేస్తూ, కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేసి, నదీ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లుగా టీడీపీ నిరంకుశత్వంపై పోరాడాం. గత పాలకుల నిర్వాకంపై ఎన్జీటీలో కేసులు కూడా వేశాం. గ్రామాల్లో రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తే వాటిని అడ్డుకుని అక్రమంగా అరెస్టులు చేసి, కేసులు బనాయించారు. వాటిని కొట్టేసి, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. 
 – అనుమోలు గాంధీ, లింగాయపాలె

రాజధానికి భూములిస్తే రికార్డులు తారుమారు  
నాకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 84, 85లో ఉన్న 2 ఎకరాల 30 సెంట్ల భూమిని సీఆర్‌డీఏ ఇచ్చా. కౌలు చెల్లింపులో వ్యత్యాసం రావడంతో అధికారులను అడిగితే పూలింగ్‌లో నేను ఇచ్చింది ఎకరా 90 సెంట్లు మాత్రమేనన్నారు. దీనిపై నేను గట్టిగా నిలదీస్తే అసలు గుట్టు తెలిసింది. స్థానిక టీడీపీ నాయకులు నా భూమిలో 40 సెంట్లు వారి పేరుపై నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించుకుని పరిహారం కాజేశారు.
 – తరిగొప్పుల వసంతరావు, అనంతవరం గ్రామం, తుళ్లూరు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement