
సాక్షి, అమరావతి: పేద, బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లు చరిత్రాత్మకమైనదని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో తప్పనిసరిగా విద్యాబోధన జరగాలంటూ ఈ బిల్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి.. శాసనమండలికి పంపించిందని, మండలిలోని పెద్దలు ఈ బిల్లును మరింత కూలకశంగా చర్చించి.. సూచనలు, సలహాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా బిల్లు మీద నాలుగు సవరణలు ప్రతిపాదిస్తూ మండలి తిరిగి శాసనసభకు పంపిందని తెలిపారు. ఇంగ్లిష్ మీడియాన్ని ఎత్తివేయాలని, లేదా తెలుగు మీడియం తీసుకోవాలా? ఇంగ్లిష్ మీడియమా? అన్న నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని సవరణలు పంపారని, శాసనమండలిలో తనకు మెజారిటీ ఉండటంతో చంద్రబాబు ఈ విధంగా దురుద్దేశంతో ఈ బిల్లును తిప్పి పంపారని ఆర్కే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు.
విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలందరికీ కచ్చితంగా విద్యను ఉచితంగా అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందని గుర్తు చేశారు. శ్రీచైతన్య, నారాయణ వంటి ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియంలో అసలు బోధన జరగడం లేదని, నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలోనే వాళ్లు బోధిస్తున్నారని తెలిపారు. తన బినామీలు, తన మనుషులు చేసే ఇలాంటి చర్యలు సమర్థించే చంద్రబాబు.. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద పిల్లలు, అగ్రకులాల పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పేదలెవరూ ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదన్న దుర్బుద్ధితో చంద్రబాబు ఈ బిల్లుకు అడ్డుపడుతున్నారని, మండలిలో బలముందని ఇలా బిల్లులను చంద్రబాబు దురుద్దేశంతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తన కుట్రల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆర్కే ధ్వజమెత్తారు.