సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలోకి దూకిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో సీటు కోసం తంటాలు పడుతున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సీటు ఇస్తారో, లేదోనన్న అనుమానం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపుఅధికార పార్టీ ఇప్పటికే గెలుపోటములపై సర్వే చేస్తోంది. ఓటమి ఖాయమని సర్వేలో ఫలితం వచ్చిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన సతీమణిని రంగంలోకి దించారు. ఒకవేళ తాను ఓడిపోతానని భావిస్తే..తన సతీమణికి సీటు వచ్చేలా చూసుకునేందుకు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా సదరు ఎమ్మెల్యే సతీమణి నేరుగా రంగంలోకి దిగారు. పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సీటు తనదే అంటూ మరో యువనేత ప్రకటిస్తున్నారు. సర్వే ఆధారంగా తనకు సీటిస్తారని కూడా కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రూటు మార్చారు. ఒకవేళ తాను ఓడిపోతానని భావిస్తే... పార్టీ మారిన సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు తనకు కాకపోయినా తన సతీమణికైనా సీటు ఇవ్వాలని కోరేందుకే ముందస్తుగా ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సర్వే గుబులుతో..
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అధికార పార్టీ భావించింది. ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యేల వలసలను భారీగా ప్రోత్సహించింది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకూ వెచ్చించింది. మంత్రి పదవులనూ ఎర వేసింది. భారీ ప్యాకేజీ తీసుకుని పలువురు ఎమ్మెల్యేలు గోడ దూకి అధికార పార్టీలో చేరారు. అయితే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగలేదు. దీంతో ఉన్న సీట్లకు పోటీ పెరిగింది. ఇది కాస్తా గోడ దూకిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది. ఈ తరుణంలోనే అధికార పార్టీ సర్వే చేసింది. మీరు ఓడిపోతారని సర్వేలో తేలిందంటూ సదరు ఎమ్మెల్యే వద్ద చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. మరోవైపు సొంత పార్టీలోని నేతల నుంచి కూడా రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకు సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తే.. తన సతీమణికి సీటు అడగాలని సదరు ఎమ్మెల్యే భావిస్తున్నారు. సర్వే నివేదిక బట్టబయలు అయినప్పటి నుంచి ఆమెను కూడా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. ఎమ్మెల్యే దూరాలోచనను చూసి ఆ పార్టీ నేతలే విస్తుపోతున్నారు.
అంగన్‌వాడీ నుంచి అన్నీ...
రెండు నెలల నుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే సతీమణి అంగన్‌వాడీల నుంచి అన్ని విషయాలనూ పర్యవేక్షిస్తున్నారు. ఏ హోదాలో అంగన్‌వాడీలను తనిఖీ చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నేరుగా పార్టీ కార్యకర్తలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మహిళా సంఘాల వ్యవహారాలను కూడా చూస్తున్నారు. అధికారులతోనూ మాట్లాడుతూ పనులు చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆమె సిఫారసు చేస్తూ లేఖ పంపడం చర్చనీయాంశమవుతోంది. పార్టీ తరఫున వార్డుల్లో కూడా పర్యటిస్తున్నారు. తనకు కాకపోతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెకు సీటిస్తే మహిళా ఓటు బ్యాంకు కూడా కలిసి వస్తుందని చెప్పాలనేది ఎమ్మెల్యే ఆలోచనగా ఉంది. మొత్తమ్మీద ఎమ్మెల్యే వ్యవహారశైలి కాస్తా అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment