విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
కర్నూలు, పెద్దకడబూరు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీని సాధనకు పార్టీలకు అతీతంగా పోరాటాలు సాగించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పెద్దకడబూరు మండలం గంగులపాడు గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలను సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. ఓటుకు కోట్లు కేసు, అవినీతిపై విచారణ చేస్తారన్న భయంతోనే ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రమైనా చంద్రబాబు మాత్రం సీఎంల్లో అందరికంటే ధనికుడిగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. రాజధాని భజన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. వామపక్ష నాయకులు సైతం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని, టీడీపీ మాత్రం పక్కనపెట్టిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఉనికి కోసమే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రామా ఆడారని విమర్శించారు. రాష్ట్రప్రయోజనాలపై ఏమాత్రం పట్టింపు ఉన్నా వెంటనే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి ఒకటిన చేపట్టే కలెక్టరేట్ల ముట్టడి, 5న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాకు మద్దతుగా నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే జననేత జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు నోరెత్తడం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీపై మోజు చూపుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో టీడీపీ నాయకులకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీ రఘురాం, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment