కార్పొరేటర్ రాజానాయుడ్ని మందలిస్తున్న పోలీసులు
నెల్లూరు : వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కార్పొరేటర్ రాజానాయుడి మధ్య నెలకొన్న ఇంటి వివాదం ముదురుతోంది. దీంతో వీరి మద్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజానాయుడు తాను కొనుగోలు చేసిన ఇంట్లో గురువారం గృహప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివాదం నడుస్తున్న సమయంలో గృహప్రవేశం ఎలా చేస్తారంటూ రాజా నాయుడ్ని ప్రశ్నించారు. దీంతో వారి నడుమ వాగ్వా దం చోటుచేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం పేరిట పోలీసులు రాజా నాయుడ్ని, అతని అనుచరులను ఇంట్లో నుంచి బయటకు పంపారు. వివరాలు.. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పొదలకూరురోడ్డు చైతన్యపురి న్యూమిలటరీకాలనీ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో మాదాల తిమ్మయ్యనాయుడు(మాదాల జానకీరామ్ సోదరుడు) ఇంటిని రెండేళ్ల క్రితం అద్దెకు తీసుకొని అతిథి గృహంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదాల తిమ్మయ్యనాయుడు ఇంటిని విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారపార్టీ నాయకుడు, 29వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. తిమ్మయ్యనాయుడు, రాజా నాయుడు కలిసి ఎమ్మెల్యేతో ఇంటి విషయమై మాట్లాడారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 11న రాజానాయుడు ఆ ఇంటిని సుమారు రూ. రెండు కోట్లకు కొనుగోలు చేశారు. అనంతరం ఇంటి కొనుగోలు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేసి ఖాళీచేయాలని కోరారు.
కేసు నమోదు
ఇంటిని ఖాళీచేసేదిలేదని ఎమ్మెల్యే చెప్పడంతో ఈ నెల ఐదో తేదీ రాత్రి రాజానాయుడు బావ అక్కపునాయుడు, అతని అనుచరులు అతిథిగృహ ప్రాంగణంలో ఉన్న రెండు గదులు కలిగిన గోడౌన్‌ను «ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కురుగొండ్ల మేనేజర్ విజయశంకర్ అతిథిగృహానికి చేరుకొని అడ్డుకునేందుకు యత్నించగా, అతనిపై దౌర్జన్యం చేశారు. విజయశంకర్ ఫిర్యాదు మేరకు ఐదో నగర పోలీసులు రాజానాయుడు, అక్కపునాయుడితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. రాజానాయుడు సైతం కురుగొండ్లపై ఫిర్యాదు చేశారు. ఇంటిని ఖాళీ చేయాలంటే రూ.15 లక్షల గుడ్‌విల్ ఇవ్వాలని, లేకపోతే ఖాళీ చేసేదిలేదని, దిక్కున్నచోట చెప్పుకోమని ఎమ్మెల్యే బెదిరించారని రాజానాయుడు పేర్కొన్నారు. రాజానాయుడి ఫిర్యాదుపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ముదిరిన వివాదం
ఇంటి విషయమై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోర్టులో ఇంజెషన్ ఆర్డర్ కోసం యత్నిస్తున్నారనే సమాచారం రాజానాయుడికి తెలిసింది. దీంతో గురువారం ఉదయం రాజానాయుడు తన కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి తాను కొనుగోలు చేసిన ఇంట్లో గృహప్రవేశం చేసి పూజలు చేపట్టారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ మురళీకృష్ణ, సంతపేట, వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్లు పాపారావు, సుధాకర్‌రెడ్డి, వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ ఎస్సైలు రమణ, చిట్టిబాబు ఘటన స్థలానికి చేరుకొని అందర్నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. వారిని ఇంట్లో నుంచి బయటకు పంపించేందుకు యత్నించే సమయంలో కార్పొరేటర్, పోలీసుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చట్ట ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకోవాలని, ఇలా దౌర్జన్యం చేస్తే సహించేదిలేదని పోలీసులు రాజానాయుడ్ని హెచ్చరించారు. తన ఇంట్లోకి పోవడం తప్పానని ఆయన ప్రశ్నించడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నగర డీఎస్పీ అక్కడికి చేరుకొని తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దౌర్జన్యానికి దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కొనసాగుతున్న పోలీస్ పికెట్
వివాదాస్పద ఇంటి వద్ద పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద ఎలాంటి గొడవ జరిగినా కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. తనకు న్యాయం జరిగేంతవరకూ అక్కడి నుంచి వెళ్లేదిలేదని ఇంటి బయట తన అనుచరులతో బైఠాయించారు.
విద్యుత్ సరఫరా నిలిపివేత
వివాదాస్పద ఇంటికి అధికారులు విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపేశారు. ఏవైనా గొడవలుంటే అవి సామరస్యంగా పరిష్కారమయ్యేలా చూడాలని, అలా కాకుండా కొందరు అధికారులు దగ్గరుండి విద్యుత్, నీటి సరఫరాను నిలిపేసేలా చర్యలు తీసుకోవడం దారుణమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఇంట్లో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన నగర డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపటికే సరఫరాను పునరుద్ధరించారు.
అధికార పార్టీలో కలకలం
అధికార పార్టీ ఎమ్మెల్యే, కార్పొరేటర్ నడుమ రోజురోజుకూ వివాదం ముదురుతోంది. దీంతో అధికార పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే వైఖరిపై పలుమార్లు పార్టీ జిల్లా నేతలకు కార్పొరేటర్ రాజానాయుడు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు నేతలు సర్దిచెప్పేందుకు యత్నిం చారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారు సూచించినా ఫలితం లేకుండాపోయింది. నేతలెవరూ పట్టించుకోకపోవడంతో తానే స్వయంగా ఎమ్మెల్యే ఆగడాలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యానని రాజానాయుడు మీడియా ముందు తెలిపారు. మొత్తమ్మీద ఎమ్మెల్యే కురుగొండ్ల, కార్పొరేటర్ రాజా నాయుడు మధ్య వివాదం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment