MLA Kurugondla
-
ఎమ్మెల్యే X కార్పొరేటర్
నెల్లూరు : వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కార్పొరేటర్ రాజానాయుడి మధ్య నెలకొన్న ఇంటి వివాదం ముదురుతోంది. దీంతో వీరి మద్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజానాయుడు తాను కొనుగోలు చేసిన ఇంట్లో గురువారం గృహప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివాదం నడుస్తున్న సమయంలో గృహప్రవేశం ఎలా చేస్తారంటూ రాజా నాయుడ్ని ప్రశ్నించారు. దీంతో వారి నడుమ వాగ్వా దం చోటుచేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం పేరిట పోలీసులు రాజా నాయుడ్ని, అతని అనుచరులను ఇంట్లో నుంచి బయటకు పంపారు. వివరాలు.. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పొదలకూరురోడ్డు చైతన్యపురి న్యూమిలటరీకాలనీ ఎక్స్టెన్షన్ ఏరియాలో మాదాల తిమ్మయ్యనాయుడు(మాదాల జానకీరామ్ సోదరుడు) ఇంటిని రెండేళ్ల క్రితం అద్దెకు తీసుకొని అతిథి గృహంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదాల తిమ్మయ్యనాయుడు ఇంటిని విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారపార్టీ నాయకుడు, 29వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. తిమ్మయ్యనాయుడు, రాజా నాయుడు కలిసి ఎమ్మెల్యేతో ఇంటి విషయమై మాట్లాడారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 11న రాజానాయుడు ఆ ఇంటిని సుమారు రూ. రెండు కోట్లకు కొనుగోలు చేశారు. అనంతరం ఇంటి కొనుగోలు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేసి ఖాళీచేయాలని కోరారు. కేసు నమోదు ఇంటిని ఖాళీచేసేదిలేదని ఎమ్మెల్యే చెప్పడంతో ఈ నెల ఐదో తేదీ రాత్రి రాజానాయుడు బావ అక్కపునాయుడు, అతని అనుచరులు అతిథిగృహ ప్రాంగణంలో ఉన్న రెండు గదులు కలిగిన గోడౌన్‌ను «ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కురుగొండ్ల మేనేజర్ విజయశంకర్ అతిథిగృహానికి చేరుకొని అడ్డుకునేందుకు యత్నించగా, అతనిపై దౌర్జన్యం చేశారు. విజయశంకర్ ఫిర్యాదు మేరకు ఐదో నగర పోలీసులు రాజానాయుడు, అక్కపునాయుడితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. రాజానాయుడు సైతం కురుగొండ్లపై ఫిర్యాదు చేశారు. ఇంటిని ఖాళీ చేయాలంటే రూ.15 లక్షల గుడ్‌విల్ ఇవ్వాలని, లేకపోతే ఖాళీ చేసేదిలేదని, దిక్కున్నచోట చెప్పుకోమని ఎమ్మెల్యే బెదిరించారని రాజానాయుడు పేర్కొన్నారు. రాజానాయుడి ఫిర్యాదుపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముదిరిన వివాదం ఇంటి విషయమై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోర్టులో ఇంజెషన్ ఆర్డర్ కోసం యత్నిస్తున్నారనే సమాచారం రాజానాయుడికి తెలిసింది. దీంతో గురువారం ఉదయం రాజానాయుడు తన కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి తాను కొనుగోలు చేసిన ఇంట్లో గృహప్రవేశం చేసి పూజలు చేపట్టారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ మురళీకృష్ణ, సంతపేట, వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్లు పాపారావు, సుధాకర్‌రెడ్డి, వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ ఎస్సైలు రమణ, చిట్టిబాబు ఘటన స్థలానికి చేరుకొని అందర్నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. వారిని ఇంట్లో నుంచి బయటకు పంపించేందుకు యత్నించే సమయంలో కార్పొరేటర్, పోలీసుల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చట్ట ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకోవాలని, ఇలా దౌర్జన్యం చేస్తే సహించేదిలేదని పోలీసులు రాజానాయుడ్ని హెచ్చరించారు. తన ఇంట్లోకి పోవడం తప్పానని ఆయన ప్రశ్నించడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నగర డీఎస్పీ అక్కడికి చేరుకొని తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దౌర్జన్యానికి దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్ వివాదాస్పద ఇంటి వద్ద పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద ఎలాంటి గొడవ జరిగినా కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. తనకు న్యాయం జరిగేంతవరకూ అక్కడి నుంచి వెళ్లేదిలేదని ఇంటి బయట తన అనుచరులతో బైఠాయించారు. విద్యుత్ సరఫరా నిలిపివేత వివాదాస్పద ఇంటికి అధికారులు విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపేశారు. ఏవైనా గొడవలుంటే అవి సామరస్యంగా పరిష్కారమయ్యేలా చూడాలని, అలా కాకుండా కొందరు అధికారులు దగ్గరుండి విద్యుత్, నీటి సరఫరాను నిలిపేసేలా చర్యలు తీసుకోవడం దారుణమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఇంట్లో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన నగర డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపటికే సరఫరాను పునరుద్ధరించారు. అధికార పార్టీలో కలకలం అధికార పార్టీ ఎమ్మెల్యే, కార్పొరేటర్ నడుమ రోజురోజుకూ వివాదం ముదురుతోంది. దీంతో అధికార పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే వైఖరిపై పలుమార్లు పార్టీ జిల్లా నేతలకు కార్పొరేటర్ రాజానాయుడు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు నేతలు సర్దిచెప్పేందుకు యత్నిం చారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారు సూచించినా ఫలితం లేకుండాపోయింది. నేతలెవరూ పట్టించుకోకపోవడంతో తానే స్వయంగా ఎమ్మెల్యే ఆగడాలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యానని రాజానాయుడు మీడియా ముందు తెలిపారు. మొత్తమ్మీద ఎమ్మెల్యే కురుగొండ్ల, కార్పొరేటర్ రాజా నాయుడు మధ్య వివాదం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. -
ఎమ్మెల్యే రామకృష్ణను ఛీకొట్టండి
కురుగొండ్లపై చర్యలు తీసుకోవాలంటూ డీవైఎఫ్ఐ ర్యాలీ నెల్లూరు(సెంట్రల్): అవినీతికి కేరాఫ్‌గా మారి బెదిరింపులకు దిగుతున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను ఛీకొట్టాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటరు నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేసే రామకృష్ణను ప్రతిఒక్కరూ ఛీకొట్టి బుద్ధిచెప్పాలన్నారు. రోజురోజుకూ ఆయన చేష్టలు మితిమీరిపోతున్నాయని, గతంలో కలెక్టర్‌ను సైతం భయపెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి రామకృష్ణ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారని, వీరు చేసే అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌ను రూ.5 కోట్లు డిమాండ్ చేయడం, పనులు జరగకుండా భయపెట్టడం రాక్షస చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తులు ప్రజల మధ్య ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో కార్యదర్శి కిరణ్, నంద కిరణ్, రాము, చిన్న, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
పెంచలకోనలో ఉచిత వైఫై సేవలు
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో క్షేత్ర వివరాలను తెలిపే వెబ్సైట్, ఉచిత వైఫై సేవలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వెబ్సైట్ ద్వారా కోనలో జరిగే నిత్య కార్యక్రమాలు తెలుసుకోవచ్చునని వివరించారు. వెబ్‌సైట్‌ను మారెళ్ల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సంపత్ రూపొందించినట్లు తెలిపారు. అలాగే పెంచలకోనలో సెల్ సిగ్నల్స్ అందక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. రూ.3లక్షల విలువ చేసే వైఫై హాట్‌స్పాట్‌ను హైదరాబాదుకు చెందిన సంస్థ ఉచితంగా అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నానాజీ, గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, ఈఓ శ్రీరామమూర్తి, ధర్మకర్తలు సోమయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
జాతరలో వీఐపీ పాస్‌ల రద్దు
ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులతో సమీక్ష సమావేశం వెంకటగిరి: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ఈ ఏడాది వీఐపీ పాస్‌ల రద్దును పక్కాగా అమలు చేస్తామని, తాను సైతం రూ.500 టికెట్ కొని అమ్మవారిని దర్శించుకుంటానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. జాతర ఏర్పాట్లపై ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాను సైతం అమ్మవారి దర్శనం వద్దకు అనుమతించకుండా ఆర్చి వద్ద పాయింట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. క్యూలైన్లలో వినూత్నంగా స్టీల్ బ్యారికేడ్లు, వాటికి మెష్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్రాబ్యాంక్ సెంటర్ నుంచి మూడు క్యూలైన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీవీఐపీలకు పోలీస్ బందోబస్తుతో అమ్మవారి దర్శనం చేయిస్తామని వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ నెల 20 నుంచే పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 18 నుంచి ప్రత్యేక జాతర వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి జాతరకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఆర్టీసీ డీఎం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది 120 ప్రత్యేక బస్సులను రెండు రోజుల పాటు నడుపుతామని వెల్లడించారు. జాతరలో లైటింగ్, షామియానాలు, బ్యారికేడ్లు, జనరేటర్లు, తదితర వాటిని దేవాదాయ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తామని దేవస్థాన ఈఓ రామచంద్రరావు చెప్పారు. తాగునీటి సరఫరా, పబ్లిక్ టాయ్లెట్లు, జంతు వధశాలలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, గూడూరు ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రవీంద్రరెడ్డి, ఎంపీపీ నక్కల మునెమ్మ, జెడ్పీటీసీ దట్టం గుర్నాథం, తహశీల్దార్ మైత్రేయ, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రహీమ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ శరత్‌బాబు, ట్రాన్స్‌కో ఏఈ జయకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పోలేరమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
వెంకటగిరి: జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి గ్రామశక్తి జాతర నిర్వాహణకు సబంధించి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను సోమవారం ఆ దేవస్థానం వద్ద స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే పోలేరమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, దేవస్థానం ఈవో వై రామచంద్రరావు, తహసీల్దార్ మైత్రేయ, జెడ్పీటీసీ దట్టం గుర్నా«థం, కౌన్సిలర్ కె చెంగారావు, లాలాపేట సింగిల్‌విండో అధ్యక్షుడు గొల్లగుంట వెంకటముని పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కురుగొండ్లపై సీఎం ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులు క్రితం సాక్షిలో ప్రచురితమైన ‘వెంకటగిరిలో దాదాగిరి’ కథనం కాపీలతో ఇక్కడ పరిస్థితిని వివరిస్తూ కాంట్రాక్టర్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. వెంకటగిరిలో రూ.లక్ష పనికి కూడా కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేకపోతున్నారని, ఎమ్మెల్యే రామకృష్ణ తమను బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల రూ.2.60 కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ ముగిశాక పనులు తమవారికి దక్కక పోవడంతో ఎమ్మెల్యే అధికారులను బెదిరించి ఏ కారణం లేకుండా టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వ్యవహర తీరును మార్చకపోతే వెంకటగిరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనికి కూడా టెండర్లు వేయడం తమవల్ల కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, గవర్నర్ నరసింహానికి వారు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు రోజుల క్రితం చంద్రబాబు రామకృష్ణను విజయవాడకు పిలిపించి మాట్లాడారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, అధికారులను తిట్టడం లాంటి చర్యలతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక మీదట పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికారులు ఎవరూ నీ మాట వినకుండా చేస్తానని హెచ్చరించారని సమాచారం. సాక్షి పత్రికలో తన మీద అవాస్తవ కథనాలు రాశారని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారని తెలిసింది. సాక్షిలో వచ్చిన కథనాలపై విచారణ జరిపించాలని, అందులో వాస్తవాలు ఉండబట్టే విజయవాడకు పిలిపించామని సీఎం మండిపడ్డారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.