జాతరలో వీఐపీ పాస్‌ల రద్దు
-
ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
-
అధికారులతో సమీక్ష సమావేశం
వెంకటగిరి: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ఈ ఏడాది వీఐపీ పాస్‌ల రద్దును పక్కాగా అమలు చేస్తామని, తాను సైతం రూ.500 టికెట్ కొని అమ్మవారిని దర్శించుకుంటానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. జాతర ఏర్పాట్లపై ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాను సైతం అమ్మవారి దర్శనం వద్దకు అనుమతించకుండా ఆర్చి వద్ద పాయింట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. క్యూలైన్లలో వినూత్నంగా స్టీల్ బ్యారికేడ్లు, వాటికి మెష్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్రాబ్యాంక్ సెంటర్ నుంచి మూడు క్యూలైన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీవీఐపీలకు పోలీస్ బందోబస్తుతో అమ్మవారి దర్శనం చేయిస్తామని వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ నెల 20 నుంచే పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 18 నుంచి ప్రత్యేక జాతర వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి జాతరకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఆర్టీసీ డీఎం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది 120 ప్రత్యేక బస్సులను రెండు రోజుల పాటు నడుపుతామని వెల్లడించారు. జాతరలో లైటింగ్, షామియానాలు, బ్యారికేడ్లు, జనరేటర్లు, తదితర వాటిని దేవాదాయ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తామని దేవస్థాన ఈఓ రామచంద్రరావు చెప్పారు. తాగునీటి సరఫరా, పబ్లిక్ టాయ్‌లెట్లు, జంతు వధశాలలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్ తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతుశారద, గూడూరు ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రవీంద్రరెడ్డి, ఎంపీపీ నక్కల మునెమ్మ, జెడ్పీటీసీ దట్టం గుర్నాథం, తహశీల్దార్ మైత్రేయ, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రహీమ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ శరత్‌బాబు, ట్రాన్స్‌కో ఏఈ జయకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.