
సాక్షి, వెంకటగిరి(నెల్లూరు) : గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో జాతర ఆదాయం పెరిగింది. జాతర రోజు వర్షం కురిసినా అమ్మదర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు. శక్తిస్వరూపిణి పోలేరమ్మ జాతర హుండీ ఆదాయం వివరాలను ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి శుక్రవారం వివరించారు. అంతకుముందు దేవదాయశాఖ కార్యాలయం ఆవరణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జాతరలో ప్రత్యేక దర్శనం టికెట్ రూ.100 ద్వారా రూ.5,13,700 రాగా గతేడాది జాతరలో రూ.5,02,700 వచ్చింది.
ప్రత్యేక దర్శనం రూ.200 టికెట్‌ల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.8,46,000 రాగా గతేడాది రూ.7,78,400 వచ్చింది. హుండీల ద్వారా ఈ ఏడాది రూ.13,12,018 రాగా గతేడాది రూ.12,10,282 వచ్చింది. హుండీల ద్వారా గతేడాది కంటే ఈ ఏడాది రూ.1,01,737 ఆదాయం పెరిగింది. విరాళాల ద్వారా ఈ ఏడాది రూ.1,57,244 రాగా గతేడాది రూ.98,466 వచ్చింది. విరాళాల ద్వారా ఈ ఏడాది రూ.58,778 రాబడి వచ్చింది. మొత్తం మీద గతేడాది మొత్తం రూ.25,89,848 రాగా ఈ ఏడాది జాతరలో రూ.28,28,963 రాబడి వచ్చింది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రూ.2,39,115 రాబడి పెరిగినట్లు ఈఓ వివరించారు.
ఆభరణాలు కూడా..
వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతరలో డొనేషన్లు, టికెట్‌ల ద్వారానే కాకుండా అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను సైతం భక్తులు గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో సమర్పించుకున్నారు. బంగారం గతేడాది 14.600 గ్రాములు రాగా ఈ ఏడాది 56.580 గ్రాములు భక్తులు సమర్పించారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 41.980 గ్రాముల బంగారం పెరిగింది. ఇక వెండి ఈ ఏడాది 1,896 కేజీలు రాగా గతేడాది 0.131 గ్రాములు మాత్రమే వచ్చింది. గతేడాది కంటే 1.765 కేజీల వెండి ఆభరణాలు అమ్మవారికి అధికంగా సమకూరినట్లు ఈఓ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment