జాతర విజయవంతానికి సహకరించండి
వెంకటగిరి : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరను విజయవంతం చేసేందుకు స్థానికులు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. స్థానిక త్రిపురసుందరి కల్యాణ మండపంలో గురువారం జాతర శాంతిసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల సూచన మేరకు జాతరలో వీఐపీ పాస్ రద్దుతోపాటు రూ.500 టికెట్‌ను రూ.250కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలేరమ్మ నిలుపు మండపాన్ని ఈ ఏడాది సంప్రదాయ తడకలతో కాకుండా ఇనుప చట్రాలతో 8 అడుగులకు బదులు 6 అడుగులు మాత్రమే ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నామని, క్యూలైన్‌లో భక్తులకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్‌లను పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతుశారద, వైఎస్సార్‌సీపీ నాయకుడు నెమళ్లపూడి సురేష్‌రెడ్డి, బీజేపీ నాయకుడు ఎల్.కోటీశ్వరరావు మాట్లాడారు. సంప్రదాయాలకు అనుగుణంగా జారత ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అంతకుముందు పోలేరమ్మ దేవస్థానం హుండీ ఆదాయంతోపాటు జాతర రాబడికి సంబంధించిన నగదు జమ ఖర్చుల వివరాలు సమగ్రంగా చెప్పకపోవడంతో ఎమ్మెల్యే దేవాదాయశాఖ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారానికి దేవాదాయశాఖ కార్యాలయంలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బీరంరాజేశ్వరరావు, తహసీల్దార్ మైత్రేయ పి.రాజేశ్వరరావు, తాండవ చంద్రారెడ్డి, ఈవో వై.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.