సాక్షి, కృష్ణా: రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కంటి సమస్యను పరిష్కరించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. జిల్లాలోని కానూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు పథకం కింద విద్యార్థులకు ఉచిత కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జిల్లా వైద్య అధికారులు తదితురులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 6 లక్షల మంది విద్యార్థుల్లో 44 వేల మంది విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసిన నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు. కానీ ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి.. దీని కింద ఉన్న1000 వ్యాధులకు చికిత్స అమలు కాకుండా వాటి సంఖ్యను తగ్గించిందని ఆయన మండిపడ్డారు.
కాగా ప్రతి వ్యాధి ఆరోగ్య శ్రీ పథకంలోకి వచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని, అదనంగా మరో 57 అర్ధోపెడిక్ వ్యాధులను కూడా చేర్చిన ఘనత సీఎం జగన్‌ది అన్నారు. ప్రభుత్వ బడుల్లో అమలు చేసే ఇంగ్లీష్ మీడియం మత బోధనకే అని, తెలుగు మీడియంను దెబ్బతీస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేశారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ అని... 6 నెలల లక్ష్యంతో కూడిన పాలన సాగించారని వ్యాఖ్యానించారు. ఇక కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో 6 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశామని వారిలో 40 వేల విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో 14,734 మందికి కళ్ల జోళ్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment