ప్రకాశ్‌సింగ్ బాదల్ ఆశీర్వాదం తీసుకుంటున్న మోదీ
రత్లాం/సోలన్: దేశంలో ఇప్పుడు మోదీ గాలి వీయడం లేదని కొందరు ఎన్నికల పండితులు దుష్ప్రచారం చేస్తున్నారనీ, దేశంలోని ప్రతీ ఇంట్లో నుంచి మోదీ గాలి వీస్తోందని ప్రధాని మోదీ సోమవారం అన్నారు. పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌లలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘దేశంలో మోదీ గాలి లేదని గతంలో కొందరు ఎన్నికల పండితులు అన్నారు. కానీ గతంలోకన్నా ఇప్పుడు పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. రికార్డులు సృష్టిస్తున్న వారిలో రెండు రకాల ప్రజలు ఉన్నారన్న విషయం ఆ కొందరికి తెలియదు. తొలిసారి ఓటేస్తున్న నా యువ స్నేహితులు ఒక రకమైతే, ఇక రెండో రకం తమ కొడుకు/సోదరుడిని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్న నా తల్లులు, సోదరిలు. వారికి వంటగ్యాస్, కరెంట్ ఇచ్చాను. వారంతా నాకు ఓటేయడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వీరంతా ఏ గాలి వల్ల వస్తున్నారో అర్థం చేసుకోవడంలో ఆ ఎన్నికల పండితులు విఫలమయ్యారు. ఆ గాలి ప్రతీ ఇంటి నుంచి వస్తోంది.’ అని అన్నారు.
దేశంలో భోపాల్ విషవాయువు ఘటన, కామన్వెల్త్ ఆటలు, 2జీ స్పెక్ట్రం కుంభకోణం తదితర కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలో జరిగినవేననీ, ఇప్పుడు ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా సిక్కు అల్లర్లపై ‘అయ్యిందేదో అయ్యింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వారి సిగ్గులేని తనానికి నిదర్శనమని మోదీ మండిపడ్డారు. ఐఎన్‌ఎస్ విరాట్‌ను గాంధీలు విహారయాత్రలకు ఉపయోగించుకోవడం, ఉగ్రవాదులు, నక్సలైట్ల దాడుల్లో జవాన్లు చనిపోవడం తదితర ఏ అంశంపై ప్రశ్నించినా ఇకపై కాంగ్రెస్ ‘అయ్యిందేదో అయ్యింది’ అన్న సమాధానమే ఇస్తుందని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లోని బఠిండాలో మోదీ మాట్లాడుతూ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ ఆయనను నిందించడం కాదనీ, తమ పార్టీ నేత అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు రాహులే సిగ్గుపడాలని మోదీ అన్నారు. 50 సీట్లు గెలవడానికే కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోందని విమర్శించారు.
ప్రజలనే దేవుళ్లను మోసం చేశారు..
మధ్యప్రదేశ్‌లో రైతు రుణమాఫీ హామీని అమలు చేయడంలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మోదీ అన్నారు. ఈ విషయంలో ప్రజలు అనే దేవుళ్లను కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొన్నారు. ‘భారతమాతకు జై’ అనే నినాదాన్ని పలకడానికి కూడా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆరోపించారు. హిందూ ఉగ్రవాదం అనే కొత్త పదాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ లోక్‌సభ ఎన్నికలకు భోపాల్ స్థానం నుంచి పోటీ చేస్తుండి కూడా పార్టీలో అంతర్గత కొట్లాటల వల్లే ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని, రాష్ట్రపతి సహా దేశం మొత్తం ఓటు వేస్తుంటే దిగ్విజయ్ మాత్రం ఓటు వేయలేదనీ, ఇది ఆయన దురహంకారానికి నిదర్శనమని మోదీ అన్నారు. ఓటు వేయకపోవడం ద్వారా దిగ్విజయ్ మహా పాపానికి ఒడిగట్టారనీ, తన సొంత ఊరికి వెళ్లి దిగ్విజయ్ ఓటు వేయకుండా, ఓటమికి భయపడే భోపాల్‌లోనే ఉండి ప్రజలను ఓట్లు అడిగారని మోదీ పేర్కొన్నారు.
అవి కాంగ్రెస్‌కు ఏటీఎంలు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రక్షణ ఒప్పందాలను తమకు కాసులు కురిపించే ఏటీఎంలుగా చూశాయని హిమాచల్‌ప్రదేశ్ ప్రచారంలో మోదీ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ హయాంలో రక్షణ దళాలకు అవసరమైన ఆయుధాలు, వస్తువుల్లో 70 శాతం విదేశాల నుంచే వచ్చేవి. ఆ దేశాలపై ఇండియా ఆధారపడేది. ఆయా ఆయుధాలు, వస్తువుల కొనుగోలు కోసం కాంగ్రెస్ పార్టీ విదేశాలతో చేసుకునే ఒప్పందాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా ఉండేవి. 1947లో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చే నాటికి మనకు రక్షణ వస్తువుల ఉత్పత్తిలో 150 ఏళ్ల అనుభవం ఉండగా, నాటికి చైనాకు ఏ మాత్రం అనుభవం లేదు. కానీ ఇప్పుడు చైనా నుంచి ఉత్పత్తులు కొనాల్సి వస్తోంది. ఇందుకు కాంగ్రెస్ విధానాలే కారణం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment