సాక్షి, అమరావతి: నమ్మితే నట్టేట ముంచే రకం చంద్రబాబునాయుడని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇసుక, మట్టితో సహా దోచుకున్నారని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత యం.మోహన్‌బాబు విమర్శించారు. మహానటుడు ఎన్టీ రామారావు నమ్మి పిల్లనిస్తే ఆయన చావుకు కారణమయ్యారని అన్నారు. అమాయకులైన ఆయన కుటుంబసభ్యులను వంచించారని చెప్పారు. అటువంటి చంద్రబాబు బంధాలు, అనుబంధాల గురించి మాట్లాడటం విచిత్రమని పేర్కొన్నారు. అంధకారంలో ఉన్న రాష్ట్రానికి వెలుగు రావాలంటే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాక్షించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తెలుగుదేశం నాదీ నాదీ అంటుంటారని, ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించినప్పుడు తనతో పాటు ఎంతో మంది సీనియర్లు ఉన్నారని, ఆ తర్వాతే చంద్రబాబు వచ్చారని గుర్తుచేశారు. తెలుగుదేశం చంద్రబాబుది కానేకాదని స్పష్టం చేశారు. మోహన్‌బాబు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
టీడీపీని నువ్వు లాక్కున్నావు
‘అవినీతి, లంచం అంటే అర్థం తెలియని మహానటుడు ఎన్టీ రామారావు నిద్రాహారాలు మాని రోడ్ల పక్కన స్నానాలు చేసి తెలుగు వాడు అనే పౌరుషాన్ని రగిల్చి తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించారు. అలాంటి తెలుగుదేశాన్ని నీవు లాక్కున్నావు. నీ మాయలో పడి మేము కూడా వచ్చాం. తర్వాత తెలిసింది. నీవు ఇలాగా అని. చేసింది తప్పని ఆనాడే నేను ఒప్పుకున్నాను. అలా నీవు లాక్కున్నదయ్యా తెలుగుదేశం. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీ. అది అతనిది. జస్ట్ ఇక్కడ చంద్రబాబు..తెలుగుదేశం, ఇక్కడ వైఎస్సార్‌సీపీ లేదా వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని బాగు చేయాలని, ఆ ప్రజలకు నేనున్నానని ఒక భరోసా ఇవ్వడానికి జగన్ పార్టీ స్థాపించారు. 10 సంవత్సరాల నుంచి ఏకధాటిగా నడుస్తున్న వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నువ్వు ఊసరవెల్లి కుబుర్లు చెబుతున్నావని, కల్లబొల్లి మాటలు చెబుతున్నావని, ప్రజలు నీ చేతిలో మోసపోతున్నారని, నిండా మునిగిపోతారని, ఆంధ్ర రాష్ట్రం సర్వ నాశనమై పోతుందని, అది కాపాడుకునేందుకు కంకణం కట్టుకొని 10 సంవత్సరాల నుంచి ఏకధాటిగా నడుస్తున్న వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనది పార్టీ...నీకు పార్టీ లేదు.
నీ మీద కేసుల మాటేమిటి?
ఉదయం లేచిన దగ్గర్నుంచీ సాయంత్రం వరకు చంద్రబాబుది ఒకటే మాట. ఒకటే స్లోగన్. ఏదైనా జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పించడమే. చంద్రబాబూ ఏ సభకు వెళ్లినా ‘నేను.. నేను’ అంటూ మాట్లాడుతున్నాడు. ఎవరు నువ్వు? ముందసలు ‘నేను’ అనే అహంకారాన్ని వదిలెయ్. ప్రభుత్వంలో నువ్వొకడివి. నీ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఆ విషయం పక్కనపెట్టు. కేసులు కేసులు అంటావు. 36 కేసులు పెడితే 16 లేవు అన్నారు. అయినా అవి నువ్వు పెట్టిన కేసులేగా. అయినా వాటిలో ఒక్కటైనా ప్రూవ్ అయ్యిందా? ఇక్కడే నువ్వు తలదించుకోవాలి. మరి నీమీద ఉన్న కేసుల సంగతేమిటి? నీ మీద కేసులు విచారణకు రాకుండా అక్కడే ఆపుచేసి పెట్టావు. పలుకుబడి ఉపయోగించుకుని విచారణ రాకుండా చూసుకున్నావు. నువ్వు దొంగవు కాదా? నీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా దొంగలే. వారి గురించి చెప్పవా? జగన్ గురించి చెబుతున్నప్పుడు నీ గురించి, నీ పక్కనున్న వాళ్ల గురించి చెప్పు ముందు. ఎదుటి వాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం నీది. నీకా గుణం ఉంది. అసలు నీకు క్యారెక్టర్ ఉందని ఎవరు చెప్పారు. నీకు నువ్వే చెప్పుకుంటున్నావు.
నీది లాక్కున్న భోజనం
నీ పునాది కాంగ్రెస్. అన్నయ్య కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే నీవు ఆ కాంగ్రెస్‌ను సంకన పెట్టుకున్నావు సిగ్గుండాలి. ఎన్టీ రామారావుపైనే పోటీ చేస్తానని చెప్పిన వ్యక్తివి నీవు. ప్రజలారా ఆలోచించుకోండి. భక్తవత్సల నాయుడు అనే నా పేరును మోహన్‌బాబుగా మార్చారు నా గురువు దాసరి నారాయణరావు. విజయవాడ అంటే నాకిష్టం. 1975 జూన్‌లో అనుకుంటా ఇక్కడ షూటింగ్ జరిగింది. నేను మరచిపోలేదు. మోహన్‌బాబుగా ఇక్కడి నుంచే ప్రారంభమైంది నా జీవితం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నాకు భోజనం పెట్టారు. నీకు ఎవరు పెట్టారు భోజనం చెప్పు చంద్రబాబూ? నీకు ఎవరూ పెట్టలేదు. లాక్కున్న భోజనం నీది. అన్నయ్య (ఎన్టీఆర్) భోజనం విస్తరి నువ్వు లాక్కున్నావు.. మానవత్వం లేని మనిషివి నీవు. హరికృష్ణ ఎన్నో వేల కిలో మీటర్లు అన్న వెంట తిరిగిన వ్యక్తి. ఏం చేశావు ఆ కుటుంబాన్ని. అన్న కుటుంబం చాలా అమాయకం అందుకే మోసం చేయగలిగావు. చంద్రబాబు మాటలు నమ్మినవాడు ఎవ్వడైనా నట్టేట మునిగినట్టే. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఏడాది పాటు 365 రోజులూ చెబుతూనే ఉంటా. క్యారెక్టర్ లేదని జగన్‌ను అంటుంటావు. అసలు నీకు ఉందా క్యారెక్టర్.
హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నావు
జగన్‌ది ఎప్పుడూ ఒక్కటే మాట. ప్రత్యేక హోదా కావాలన్నారు. నీవు ఏమన్నావు హోదా లేకపోయినా పర్వాలేదు ప్యాకేజీ కావాలన్నావు. ఈ విషయం ప్రజలకు తెలియాలి. చంద్రబాబుది ఈరోజు ఒకమాట, రేపొక మాట. యూటర్న్‌లు తీసుకుంటాడు. నరేంద్రమోదీ ఆంధ్రాకొస్తే ఎయిర్ పోర్టులోనే బేడీలు వేస్తానన్నాడు. తర్వాత ఆయనతోనే చేతులు కలిపాడు. పోలవరంను వైఎస్ రాజశేఖరరెడ్డి స్టార్ట్ చేశారు. పోలవరం గురించి వైఎస్ మాట్లాడుతుంటే హేళన చేశావు. ఇప్పుడు నువ్వు అదే పోలవరం పాట పాడుతున్నావు. పోలవరానికి ఎంత ఖర్చు అయ్యింది ఏమిటో చూపించు. చెప్పు. పోలవరంకు నిధులిచ్చిన కేంద్రం లెక్కలు అడగదా? మీకూ వ్యాపారాలు ఉంటాయి. నాకూ విద్యాలయాలు ఉన్నాయి. బ్యాంకులో అప్పు తీసుకొచ్చి అక్కడ తెచ్చిన డబ్బును కట్టవయ్యా అంటాం. ఫైనాన్స్ డైరెక్టర్ లెక్కలు చెప్పమంటే చెప్పాలి. లెక్కలు చెప్పనంటే ఎలా? కేంద్రం నుంచి తీసుకొచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పమంటే మీకు లెక్కలు చెప్పాలా? అంటావు. అంటే దొంగ, డబ్బులు దోచేశావ్,ప్రజలను మోసం చేస్తున్నావనేగా అర్ధం.
వైఎస్ ఎన్నో పథకాలు పెట్టారు..
వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు పెట్టారు. అందులో అర్హత ఉండి ఇంజనీరింగ్ కూడా చదువుకోలేని వారి కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒకటి. పేదలైన రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ ఇంకొకటి. వీటివల్ల ఎన్నో పేద కుటుంబాలు విద్య, ఆరోగ్యపరంగా బాగుపడ్డాయి. మరి చంద్రబాబు నీవేం చేశావు ఒక్క పథకం పేరు చెప్పు. నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి, ఎన్నికల ముందు పోస్ట్ డేటేడ్ చెక్కులు ఇస్తావా? చెక్కులను బ్యాంకుకు తీసుకెళ్తే ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చాడని చెప్పుకునేందుకా? ఆడపడుచులారా ఆలోచించండి. నాలుగున్నరేళ్లు మీరు కనబడలా. ఇప్పుడే చివరి దశలో కనిపించారు. ఆలోచించండి. చంద్రబాబూ.. రాజధానిని పలుచోట్ల అని ప్రాంతాలు మార్చి ప్రకటించావు.మీ బినామిలతో స్దలాలు కొనిపించావు దోచుకున్నావు. ఇలా ఆంధ్రదేశాన్ని దోచేశావ్. మనకు ఆఖరుకు కావాల్సింది 5 లేదా 6 అడుగుల స్థలమే అని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి. హైదరాబాద్ నుంచి అమరావతికి పారిపోయి వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు కేసీఆర్ కరెక్టుగా బుద్ధి చెప్పారు. చంద్రబాబుకు పదవీవ్యామోహం. ఎంత దోచాడో, ఎంతుందో నిజాలు చెబితే చేప నీటినుండి బయటకు వస్తే ఎలా కొట్టుకుందో చంద్రబాబు అలా కొట్టుకుంటాడు. పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు చెక్కులు ఇస్తున్నాడంటా ఆ డబ్బులు తీసుకోండి. అవి మీ డబ్బులే, కాననీ ఓట్లు మాత్రం జగన్‌కు వేయండి’
జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేయడానికి వస్తున్నారు. ఎన్ని వేల కిలో మీటర్లు నడిచాడండి. ఇది సామాన్యమా, మామూలు విషయమా. ప్రజలకోసం 3,600 కిలోమీటర్లు తిరిగాడు. ఇది మామూలు మానవుడికి సాధ్యమా? అనుభవం లేని జగన్‌మోహన్‌రెడ్డికి ఓట్లు వేస్తే పరిపాలన సరిగా చేయలేడు అంటావ్. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. పదేళ్లుగా ప్రజల్లో ఉంటూ అన్నీ తెలుసుకుంటున్నాడు. జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడు. పది సంవత్సరాలు పార్టీని నడపడమంటే సామాన్యమైన విషయం కాదు.
Comments
Please login to add a commentAdd a comment