
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ నాయకత్వం, కార్యకర్తలు కుట్ర చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆరోపించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తికి స్లీపర్ సెల్స్‌ను ప్రవేశపెడుతున్నారని, ఏ విధమైన ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఇటీవల పెరుగుతున్న కరోనా కేసుల వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారనే అనుమానం తమకు ఉందన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ను, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారన్నారు.
విపత్కర పరిస్థితుల్లో టీడీపీ రాజకీయ కోణంలో విమర్శలు చేస్తోందన్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారాన్ని కూడా రాజకీయం చేశారని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారని, ఆయన రావడం వల్లే రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని టీడీపీ ఆరోపణలు చేయడం హేయమన్నారు. ఏ విధమైన కరోనా లక్షణాలు లేని వ్యక్తిపై విమర్శలు చేయడం చంద్రబాబు చిల్లర రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.