వలసలతో టీడీపీ కుదేలు..  | Most Of The TDP Leaders Are Joined Into YSR Congress Party | Sakshi
Sakshi News home page

వలసలతో టీడీపీ కుదేలు.. 

Published Sat, Mar 14 2020 8:00 AM | Last Updated on Sat, Mar 14 2020 8:00 AM

Most Of The TDP Leaders Are Joined Into YSR Congress Party - Sakshi

ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ.. అబ్దుల్‌ కలాం వంటి వారికి సైతం సలహాలు ఇచ్చానంటూ గొప్పలు.. అంతర్జాతీయ స్థాయి రాజధాని పేరుతో సింగపూర్‌ గ్రాఫిక్స్‌.. ఇవేవీ చంద్రబాబును కాపాడలేకపోయాయి. అంతులేని అవినీతితోపాటు ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో ప్రజలు అసహ్యించుకున్నారు. 9 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటర్లు దూరమైతే.. ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయానికి నాయకులు సైతం పార్టీని వీడే దుస్థితి దాపురించింది. పోటీకి నిలబెట్టడానికి ఆపసోపాలు పడే పరిస్థితి నెలకొంది. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజావ్యతిరేక విధానాలతో టీడీపీ ఖాళీ అయిపోతోంది. ఆ పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి వలసపోతున్నారు. ఊహకందని విధంగా వందలాది మంది మాజీలు టీడీపీని విడిచిపెట్టేస్తున్నారు. పూర్వ ఎమ్మెల్యే, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పీఏసీఎస్‌ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నీటి సంఘం అధ్యక్షులు... ఇలా ఎందరెందరో వైఎస్సార్‌సీపీలోకి క్యూ కడుతున్నారు. ఆ పార్టీలో చేరుతున్న వారిని లెక్క కట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ శ్రేణులు డీలాపడిపోయాయి. ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ మీసాల లక్ష్మి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు దూబ ధర్మారావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జి.రామారావు, పొందూరు మాజీ జెడ్పీటీసీ లొలుగు శ్రీరాములునాయుడు, సారవకోట మాజీ జెడ్పీటీసీ జగన్నాథం దొర, ఇచ్ఛాపురం మాజీ జెడ్పీటీసీ డక్కత నూకయ్యరెడ్డి, లావేరు మాజీ వైస్‌ ఎంపీపీ మేరం సోమిబాబు, సంతకవిటి మాజీ వైస్‌ ఎంపీపీ గండ్రేటి కేసరి, ఎచ్చెర్ల పీఏసీఎస్‌ అధ్యక్షుడు పి.సాయిరాం, పలాస టీడీపీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ఖాన్, పలాస నియోజకవర్గ టీడీపీ నేత వంకా నాగేశ్వరరావు, పలాస 12వ వార్డు మాజీ కౌన్సిలర్‌ బళ్ల రేవతి, పాలకొండ మాజీ కౌన్సిలర్లు బాసూరు కాంతారావు... ఇలా చెప్పుకుంటూపోతే వందల సంఖ్యలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లైతే లెక్క పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా వేలాదిమందితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు

కొనసాగుతున్న వలసల ప్రవాహం..  
సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న వారు సైతం ఆ పార్టీని విడిచిపెట్టేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు ఛీత్కరించుకున్న తర్వాత ఇంకా కొనసాగడం అనవసరమని భావిస్తున్నారు. ప్రతి రోజూ ప్రతి గ్రామంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి పార్టీ మారుతున్న నాయకుల సందడి కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఆ పారీ్టలో ఎందరు మిగులుతారో చెప్పలేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందుకనే నామినేషన్ల ఉపసంహరణ తేదీ చివరి వరకు బరిలో ఉన్న అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడానికి ఆ పార్టీ అగ్రనేతలు భయపడుతున్నారు. ఈ రోజు దగ్గరకొచ్చిన నాయకుడు రేపు కని్పంచకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌ లేని పారీ్టలో కాలం వెళ్లదీయడం కన్న సంక్షేమ, అభివృద్ధి, చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం మంచిదని, ఆ పారీ్టకి మద్దతు పలకడం సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడమే ఈ పరిణామానికి కారణం.  

టీడీపీని ప్రభావితం చేస్తున్న అనేక అంశాలు  
టీడీపీ నేతలను అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు జన్మభూమి కమిటీ సభ్యుల అరాచకాలు, ఆగడాలు ఇంకా వారి కళ్లల్లో మెదులుతున్నాయి. ప్రజల్లో మొదట వ్యతిరేకత రావడానికి జన్మభూమి కమిటీలే కారణమని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇక నీరు చెట్టు నిధులు, ఉపాధి హామీ నిధులు, ఇసుక, సీసీ రోడ్ల నిధులు... ఇలా నిధులున్న ప్రతి పథకాన్ని కళ్ల ముందే పార్టీ నేతలు మింగేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంతర్మథనం చెందుతున్నారు. ఇక, తిత్లీ తుఫాన్‌ పరిహారంలో అక్రమాలు, ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంలో విఫలం చెందడం, పూర్తిగా నిర్లక్ష్యం వహించడం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు సరికదా కాసుల కోసం అంచనాలు పెంచుకుని పోవడం, రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ సాయం... గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోకపోవడం వలన ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడిందని.... ఇప్పట్లో ప్రజలు మరిచిపోయేలా లేరనే అభిప్రాయంతో అధిక సంఖ్యలో పార్టీ మారిపోతున్నారు. వాటికి తోడు ప్రస్తుతం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు, బీసీలకు కలి్పస్తున్న ప్రాధాన్యత, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు, చేనేత, మత్స్యకారులకు అందిస్తున్న చేయూత ఇలా ప్రతి ఒక్కటీ నేరుగా లబి్ధదారుల వద్దకే రావడం, వలంటీర్ల ద్వారా అందిస్తుండటంతో కరుడు గట్టిన టీడీపీ శ్రేణులు సైతం వైఎస్సార్‌సీపీకి ఆకర్షితులవుతున్నారు.  

పోటీకి సైతం వెనుకంజ  
నేతల ఒత్తిళ్లతో కొంతమంది నామినేషన్లు వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో కన్పిస్తున్న ప్రజా వ్యతిరేకతతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. అందుకనే కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చూస్తున్నారు. శనివారం నాటికి ఉపసంహరణలపై క్లారిటీ రానుంది. దాంతో బరిలో ఉన్నదెవరో? విరమించుకున్నదెవరో తేలిపోనుంది. చెప్పాలంటే ఎన్నికలకు ముందే ఆ పార్టీ శ్రేణులు డీలాపడిపోయి చేతులెత్తేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement