
చంద్రబాబు, మోత్కుపల్లి నర్సింహులు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం మహానాడులో ప్రకటించారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని, తమ నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారని, అయితే పట్టపగలే అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించిన విషయం విదితమే.
పార్టీ ధిక్కారానికి పాల్పడిన మోత్కుపల్లిను టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎల్.రమణ తెలిపారు. ‘మోత్కుపల్లి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఆయనకు గవర్నర్ పదవి రాదని తెలిసి గొడవ మొదలుపెట్టారు. కేసీఆర్...ఎన్టీఆర్‌కు ప్రతిరూపం అని నరసింహులు ఎలా చెపుతారు. నేరెళ్ల బాధితుల విషయంలో మోత్కుపల్లి తాను చేసిన వ్యాఖ్యలకు ఏమి సమాధానం చెబుతారు. ఆయన ద్రోహానికి క్షమాపణ లేదు. అందుకే మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment