ర్యాలీలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో ఎంపీలు బూర, బడుగుల, ఎమ్మెల్యేలు , ప్రజలకు నమస్కరిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అభివాదం చేస్తున్న బీజేపీ అభ్యర్థి శ్యాంసుందర్‌రావు
సాక్షి,యాదాద్రి : నామినేషన్ల ఘట్టం చివరి రోజున ప్రధానపార్టీలు భారీ ర్యాలీలతో తమ బల ప్రదర్శన చాటాయి. రాజకీయ పార్టీల ర్యాలీలతో భువనగిరి హోరెత్తిపోయింది. సోమవారం నామినేషన్లు వేయడానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం మూడుగంటల వరకు ర్యాలీలు, సభలు నిర్వహించారు. దీంతో భువనగిరి వీధులన్నీ సందడిగా మారాయి. మరోవైపు ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా పోలింగ్‌కు 15 రోజులే ఉండడంతో పార్టీలు ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నాయి.
విజయం కోసం ప్రచారం ముమ్మరం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. కాగా నామినేషన్ల సందర్భంగా జిల్లా కేంద్రమైన భువనగిరి నుంచి కలెక్టరేట్ వరకు వివిధపార్టీల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో పెద్దఎత్తున ఎవరికి వారే ప్రదర్శన నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీవీ శ్యాంసుందర్‌రావు, గోద శ్రీరాములు తమ పార్టీ నాయకలతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.
సాయిబాబా దేవాలయం నుంచి టీఆర్‌ఎస్ ర్యాలీ..
టీఆర్‌ఎస్ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించారు. స్థానిక సాయిబాబా దేవాలయం నుంచి కలెక్టర్‌రేట్ వరకు జరిగిన ర్యాలీలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. వినాయక చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో రాష్ట్రవిద్యా శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో భువనగిరి గులాబీమయంగా మారింది.
గూడూరు టోల్ నుంచి కాంగ్రెస్..
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒకే సమయంలో రెండుపార్టీల ర్యాలీలకు ఒకే మార్గం అనుమతి లేకపోవడంతో కాంగ్రెస్‌కు గూడూరు టోల్‌ప్లాజా నుంచి అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు భువనగిరి పార్లమెంట్‌పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఉదయం బీజేపీ ర్యాలీ
బీజేపీ అభ్యర్థి పీవీ శ్యాంసుందర్‌రావు స్థానిక సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమైన ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బీజేపీ, దాని అనుబంధ సంఘాల ప్రతినిధులు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లనుంచి తరలివచ్చారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, వేముల నరేందర్‌రెడ్డి, వేముల అశోక్, పోతంశెట్టి రవీందర్, పాశం భాçస్కర్, దాసరి మల్లేషం తదితరులు పాల్గొన్నారు.
సాదాసీదాగా సీపీఐ అభ్యర్థి
సీపీఐ అభ్యర్థి గోద శ్రీరాములు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
28న వరకు ఉపసంహరణ గడువు
నామినేషన్ల ఘట్టం ముగియడంతో అధికారులు 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగియనుంది. దీంతో ఇక అభ్యర్థుల ప్రచారానికి మిగిలింది 15 రోజులే కావడంతో గమనార్హం. దీంతో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారానికి పార్టీలు శ్రీకారం చూడుతున్నాయి.
కేసీఆర్ సభ ఏర్పాట్లపై మంత్రి సమావేశం
బీబీనగర్ : ఏప్రిల్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరిలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తుండడంతో సోమవారం సాయంత్రం మండలంలోని రాగాల రిసార్ట్స్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వీరేశం, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం సభకు చేయాల్సిన ఏర్పాట్లు, జన సమీకరణ, అనుకూలమైన స్థలం ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. భువనగిరి శివారులో సభా స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈనెల చివరి వారంలో ఎమ్మెల్యేలు గ్రామాల్లో రోడ్డుషోలు నిర్వహించడం, సీఎం రావడంపై ప్రచారం చేయడం తదితర కార్యక్రమాలు చేపట్టేలా మంత్రి సూచనలు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment