
సాక్షి, అమరావతి: 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని గొప్పలు చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించలేని అసమర్థ సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉన్నామంటూ ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు అవినీతిలో నంబర్ వన్ స్థానంలో నిలిచారని దుయ్యబట్టారు. తనకు రెండు ఎకరాలు మాత్రమే ఉండేదని చెబుతున్న చంద్రబాబు దేశంలోనే సంపన్న సీఎంగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు.
రాజకీయ చరిత్రలో ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి పనైనా చేయలేకపోయారని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో సంక్షేమానికి బాట వేయడం వల్లే ప్రజలు ఆయన్ను మరిచిపోలేదన్నారు. వైఎస్ హయాంలో పేదల కోసం 48 లక్షల ఇళ్లు నిర్మించడంతో పాటు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 వంటి ఎన్నో పథకాలను అమలు చేసి నిరుపేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు.
వచ్చింది రూ.15 వేల కోట్ల పెట్టుబడులే
విశాఖపట్నంలో మూడు సార్లు పెట్టుబడుల సదస్సులను నిర్వహించడం వల్ల రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పైకి చెబుతున్నా వాస్తవానికి ఈ సదస్సుల మూలంగా రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని వరప్రసాద్ తెలిపారు. ప్రత్యేక హోదా సాధించి ఉంటే కేంద్రం నుంచి 90 శాతం చొప్పున గ్రాంట్లు వచ్చేవని తద్వారా పరిశ్రమలు ఎక్కువగా వచ్చేవని చెప్పారు.
రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎప్పుడూ కోరలేదన్నారు. 10 సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను చంద్రన్న కానుక, చంద్రన్న బాట, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలకు నిధులను మళ్లించారని ఆరోపించారు. ఎన్నికల ముందు 600 హామీలిచ్చి వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవుల రాజీనామాకు సిద్థమయ్యామని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలూ రాజీనామాకు సిద్ధపడాలని సూచించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటుకు నోటు కేసులో తెలంగాణ పోలీసులకు దొరికిపోయిన చంద్రబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి పారిపోయారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment