
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి పదిహేనేళ్లు ప్రత్యేకహోదా కావాలని అడిగిన చంద్రబాబు మళ్లీ ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. నలభై ఏళ్ల అనుభవం ఉండి కూడా రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
పెట్టుబడుల పేరుతో సదస్సు పెట్టి దాదాపు 20లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ డప్పుకొట్టుకున్నారని, కానీ ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి రాయితీల రూపంలో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారంటూ ప్రశ్నించారు. అసలు ప్రత్యేక ప్యాకేజీలో ఏం వచ్చిందో, అందులో ఏముందో ఏరోజు అగిడిన పాపాన పోలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంతకాలు చేస్తానని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడంతో వడ్డీల భారంతో సతమతమౌతున్నారని అన్నారు. బెల్టు షాపులను పూర్తిగా నిషేధిస్తామని ప్రకటించిన చంద్రబాబు వాటిని రద్దు చేయకుండా మహిళలను మోసం చేశారంటూ మండిపడ్డారు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు రాజకీయ అనుభవంలో ఏఒక్క మంచి పనినైనా చేశారా అని ప్రశ్నించారు. అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. పోలవరం, ప్రత్యేక ప్యాకేజీపై శ్వేతపత్రం కావాలని డిమాండ్ చేశారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడానికే కాదు ఏం చేయడానికైనా సిద్ధమేనని వరప్రసాద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment