
తిరుపతి సెంట్రల్: తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ దొంగిలించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మండిపడ్డారు. స్పీకర్ తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా వారిని మంత్రులుగా చేశారని, వెంటనే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేశాకే తాము అసెంబ్లీలో అడుగు పెడతామని తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హుందాగా చెప్పారన్నారు. అయితే, ప్రజా కోర్టులో ఎక్కడ తాము దొంగలుగా మిగులుతామోననే భయంతో అధికారపార్టీ ఉన్నఫళంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు.
తమకు ప్రజలే దేవుళ్లని, మూడేళ్లుగా అధికార పక్షం ఏవిధంగా ప్రతిపక్షంపై దాడి చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందో ప్రజలందరికీ తెలిపేందుకే వైఎస్ జగన్ ప్రజా సంక్పల యాత్రను చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకండా అడ్డుకోవడం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా తమ ఎమ్మెల్యేల గొంతు నొక్కేస్తున్నారని, ఇదేనా ప్రజాస్వామం అంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు అసెంబ్లీకి తమ ఎమ్మెల్యేలు హాజరైనా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు.
అసలు అభివృద్ధే జరగలేదని నెత్తీనోరు కొట్టుకుంటుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను చెప్పిందే అంతా జరగాలన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయనపాటి మమత, మైనార్టీ నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ, ఎస్టీ విభాగం నాయకులు హనుమంత నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment