మాట్లాడుతున్న ఎంపీ వరప్రసాద్
తెనాలి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురిచేయడం వల్లే ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్ అన్నారు. పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు తెర తీయడం మంచిపద్ధతి కాదన్నారు. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండబోదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం తెనాలిలోని ఒక హోటల్లో వైఎస్సార్‌సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ మాట్లాడారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం విడుదల అవుతున్న నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల కోసం నిధులను రాష్ట్రానికి అందజేస్తోందని, అవి కూడా లబ్ధిదారులకు చేరకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇలా జరగడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలేనని, వెంటనే ఆ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో రాష్ట్ర దళిత నాయకులు గోళ్ళ అరుణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి యాజలి జోజిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment