మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి తాను పాదాభివందనం చేశానని ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎంపీ సి.ఎం. రమేశ్‌కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తాను ప్రధానికి పాదాభివందనం చేశానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో రమేశ్ సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. మంగళవారం సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాటుసారా అమ్ముకుని బతికిన రమేశ్ తమ గురించి ఆరోపణలు చేయడంపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
వ్యవస్థలను మ్యానేజ్ చేసి డబ్బు సంపాదించగల దుర్మార్గుడు రమేశ్ అని విమర్శించారు. పజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టిన సుజనా చౌదరి ఒక ఆర్థిక నేరగాడని, ఈ ఇద్దరు నేరగాళ్లు కలసి మంగళవారం సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలసి ఏం చర్చించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మారిషస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ బ్యాంకులు సుజనా చౌదరి వల్ల దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాయ న్నారు. వందల పేపర్ కంపెనీలు సృష్టించి రింగ్ ఎంట్రీల ద్వారా ఒక సంస్థను ఇంకోదానికి అమ్మినట్టు చూపి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు.
నాకంటే ముందు సుజనా నమస్కరించారు..
సభలో తన కుంటే ముందు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ప్రధాని మోదీ వద్దకు వెళ్లి నమస్కరించారని విజయ సాయిరెడ్డి తెలిపారు. అనంతరం తాను వెళ్లి మోదీకి నమస్కరించినట్టు చెప్పారు. అప్పుడు మోదీ తనను ఎలా ఉన్నారు అంటూ అడిగారన్నారు. ఒక సంస్కారమున్న వ్యక్తిగా తాను సీఎం చంద్రబాబు ఎదురొచ్చినా నమస్కారం చేస్తానన్నారు. చేతులు జోడించి నమస్కరిస్తే పాదాభి వందనం చేసినట్టు ఎలా అవుతుంది అని విజయసాయిరెడ్డి నిలదీశారు. తాను కాళ్లమీద పడ్డట్టు టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను మోదీకి పాదాభివందనం చేశానని చెబుతున్న రమేశ్ వద్ద ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు.
మంగళవారం సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు జరిగిన పరిణామాలపై ఫుటేజ్ బయటపెట్టేలా రాజ్యసభ చైర్మన్‌ను కోరాలన్నారు. ఫుటేజీలో మార్పులు చేయకుండా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌తో సర్టిఫై చేయించాలన్నారు. అప్పుడు ఎవరు ఏం చేశారో తెలుస్తుందన్నారు. ‘సుజనా, రమేశ్.. ఇద్దరూ ఆర్థిక నేరగాళ్లు. ఉత్తరాఖండ్‌లో రమేశ్ కాంట్రాక్టు పనులు చేయకున్నా ఏ విధంగా బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నాడన్న బాగోతం మొత్తం బయటపెడతా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన సుజనాకి కేంద్ర కేబినెట్‌లో అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అండతో సుజనా జైలుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నాడు. అలాంటిది ఇద్దరు నేరగాళ్లు నాపై ఆరోపణలు చేయడం శోచనీయం. నాపై చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. చంద్రబాబును కూడా ఈ చర్చకు రమ్మనండి. ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తా. లాలూచీ రాజకీయాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు తెలియవు’ అని ఆయన పేర్కొన్నారు.
చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు
నేర చరిత్ర కలిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పార్టీ నడుపుతున్న చంద్రబాబు నేరగాళ్ల నాయకుడని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తనను విజయమాల్యాతో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘18 కేసుల్లో వ్యవస్థలను మ్యానేజ్ చేసుకొని స్టేలు తెచ్చుకున్నాడు. ఓటుకు కోట్లు కేసుల్లో ఎలా బయటపడ్డాడన్నది అందరికీ తెలుసు. మనస్సాక్షి ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ చంద్రబాబు వాయిస్‌ను నిర్ధారణ చేసిన వెంటనే ఆయన ప్రజల ముందుకు వచ్చి నిజాయితీ నిరూపించుకునేవాడు. టీడీపీ.. తెలుగు దొంగల పార్టీ.
వందల హత్యలు చేసిన పరిటాల రవి గతంలో ఆయన టీడీపీ నేత, రెండేళ్లు శిక్ష పడిన చింతమనేని ప్రభాకర్ ఆ పార్టీ ఎమ్మెల్యే. ఏలూరులో పేకాట క్లబ్ నడుపుతున్న వ్యక్తి టీడీపీ ఎంపీ, బెంగళూరులో పేకాట క్లబ్ నడుపుతున్న వ్యక్తి ఒక మంత్రి. తన వదినను చంపి ఎమ్మెల్యే కావాలన్న ఉద్దేశంతో నేరం చేసిన వ్యక్తి మరో మంత్రి. టీడీపీలో అందరూ నేరగాళ్లే. ఇంత మంది నేరగాళ్లతో పార్టీని నడుపుతున్న చంద్రబాబు చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగ. నేను ఏ ఒక్క బ్యాంకు నుంచి ఒక్క రూపాయి కూడా రుణం తీసుకొలేదు. అలాంటిది నన్ను విజయ్‌మాల్యాతో పోలుస్తారా’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేని నాయకుడు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నాడు కాబట్టి తాము బహిష్కరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment