సాక్షి, న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయం పరాకాష్టకు చేరుకుంది. ఇందుకు సాక్షాత్తూ పార్లమెంటే వేదికయ్యింది. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్న సమయంలో లోనికి వస్తున్న, బయటకు వెళ్తున్న ఎంపీలు ఆయనకు నమస్కారం చేయడంపైన కూడా అబద్ధపు ప్రచారాలకు దిగజారారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రికి పాదాభివందనం చేశారంటూ కట్టుకథ అల్లారు. లోపలి నుంచి అబద్ధ్దపు లీకు అందుకున్న ఎల్లో మీడియా రెచ్చిపోయింది. ఎల్లో చానళ్లు స్క్రోలింగులు, బ్రేకింగులు ప్రసారం చేశాయి. ఆ తర్వాత ఆ స్క్రోలింగులను అందుకుని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మరీ రెచ్చిపోయి... తెలుగువారి ఆత్మగౌరవానికి అగౌరవం జరిగిపోయిందంటూ మీడియా మైకుల ముందు ఊగిపోయారు.
ఒకపక్క అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, పోలవరం నిర్వాసితులను కూడా వంచించిన ఉదంతాలు, గ్రామస్థాయి నుంచి వేల కోట్ల ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకుతింటుండటంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకత, ఏ క్షణాన్నైనా ఈ అవినీతిపై విచారణ జరగవచ్చన్న వార్తలు ప్రబలుతుండటం, అదే సమయంలో ఆంధ్రులకు సంజీవని వంటి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంపై ప్రజలు ఏకోన్ముఖంగా పోరాడుతుండటం.. ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో తీవ్ర నిస్పృహకు కారణమయ్యాయి. ఆ పార్టీ నేతల చర్యలలో అది స్పష్టమౌతోంది.
ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు రకరకాలుగా మాటలు మార్చడం కూడా జనంలో బాగా ప్రచారమైన నేపథ్యంలో అశాంతితోనే ఆ పార్టీ నాయకులు ఇలాంటి చర్యలకు దిగజారుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పార్లమెంటు, ప్రధాని కార్యాలయం వంటి వ్యవస్థలపై కూడా ఏమాత్రం గౌరవం లేకుండా దిగజారుడు రాజకీయాలకు సిద్ధమౌతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయానికి వెళ్లడాన్ని తప్పుపట్టిన ఎల్లో సిండికేట్ ఇప్పుడు ఏకంగా ఆయన ప్రధాని కాళ్లకు మొక్కారంటూ అసత్య ఆరోపణలకు దిగజారింది. ఈ అబద్ధపు ఆరోపణలను తిప్పికొట్టిన విజయసాయిరెడ్డి.. వాస్తవాలు వెలుగుచూసేందుకు వీలుగా వీడియో ఫుటేజీ బయటపెట్టాలని కోరుతూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేశ్‌పైనా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అసలేం జరిగిందంటే..
రాజ్యసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే సభను సభాపతి ఎం.వెంకయ్యనాయుడు వాయిదా వేశారు. పదవీ కాలం పూర్తిచేసుకోబోతున్న పలువురు రాజ్యసభ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు తెలిపేందుకు వీలుగా సభ్యులంతా తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సభాపతి పదేపదే కోరినా ఫలితం లేకపోవడంతో సభను పావుగంట పాటు వాయిదా వేసి అన్ని పక్షాల నేతలను తన ఛాంబర్‌కు పిలిచారు. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలోనే ఉన్నారు. పదవీకాలం పూర్తిచేసుకోబోతున్న సభ్యులు, ఇతర సభ్యులు తమ తమ స్థానాల నుంచి ప్రధానమంత్రి వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా నమస్కరించి, పలకరించి వెళ్లారు. కొంతమంది సభ్యులు ప్రధాని ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు. ఇదే విధంగా టీడీపీ నేత వై. సుజనాచౌదరి కూడా ప్రధానమంత్రి వద్దకు వెళ్లి నమస్కరించారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి సైతం ప్రధానమంత్రి వద్దకు వెళ్లి నమస్కరించారు.
సభాపతి ఛాంబర్ నుంచి సభలోకి వస్తున్న సీఎం రమేశ్ సైతం మెట్లు దిగి వస్తూ ప్రధానికి నమస్కరిస్తూ సభలో కూర్చున్నారు. ఈ సమయంలో సభలో మెజారిటీ సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చునే ఉన్నారు. ఇదే సందర్భంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సుజనాచౌదరి, సీఎం రమేశ్ కాసేపు ముచ్చటించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి కాళ్లు పట్టుకున్నారని ఎల్లో మీడియా ప్రసారం చేసింది. ఆ వెంటనే సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి ప్రధాని కాళ్లు పట్టుకుని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. వీడియో ఫుటేజీ ఇవ్వాలని కోరారు.
నవ్వుకున్న సభ్యులు
ఎల్లో మీడియా చేసిన ప్రసారాలను తెలుసుకుని వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు నవ్వుకున్నారు. ‘టీడీపీ అధికార ప్రతినిధి ప్రసారం చేశాడా?’.. అంటూ కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీమంత్రి ప్రశ్నించారు. ‘మేమంతా అక్కడే ఉన్నాం కదా.. అందరూ ఉన్నారు కదా.. లేనిది ఉన్నట్టు ఎలా చెబుతారు’.. అని మరో సీనియర్ ఎంపీ వ్యాఖ్యానించారు.
రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు విజయసాయిరెడ్డి లేఖ
రాజ్యసభలో తాను ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కరించడాన్ని టీడీపీ నేతలు వక్రీకరించి పాదాభివందనం చేశారంటూ, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేయడంతో మంగళవారం నాటి రాజ్యసభ సమావేశాల ఫుటేజ్‌ను ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ఒక లేఖ రాశారు.
అందులో ఆయన ఏమన్నారంటే.. ‘మంగళవారం నాటి రాజ్యసభ సమావేశాలు ప్రారంభమై బుధవారం నాటికి వాయిదా పడేంతవరకు గల ఫుటేజ్‌ను ఇవ్వగలరు. ఎడిటింగ్ లేకుండా ఉన్న వీడియోను అందించగలరు. మధ్యలో కొద్దిసేపు వాయిదాపడిన సందర్భంలో కూడా ఉన్న ఫుటేజ్‌ను ఇవ్వగలరు. ఆ సమయంలో ఎక్కువమంది సభ్యులు సభలోనే ఉన్నారు. టీడీపీ సభ్యుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. నాపై కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ఫుటేజి కోరుతున్నాను. నేను సభలో ప్రధానిని కలిసిన అంశంపై ఆ టీడీపీ సభ్యుడు అమర్యాదరకరమైన, నన్ను అపఖ్యాతిపాలు చేసే రీతిలో, పార్లమెంటరీ విధానాలపై దాడిచేసే రీతిలో ఆరోపణలు చేశారు. ఈ దేశంలో అనుసరిస్తున్న పార్లమెంటరీ విధానాలను గౌరవించేందుకు వీలుగా ఈ ఫుటేజ్ ఇస్తారని ఆశిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా ఇవ్వగలరు’.. అని లేఖలో విజయసాయిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment