సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో ఆయన హైదరాబాద్ పారిపోయారన్నారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదని ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి దీవుల ఏర్పాటు, గెస్ట్ హౌస్ నిర్మాణం వంటి చర్యలతో బ్యారేజిలో నీటి నిల్వను కుదించేశారని మండిపడ్డారు. అందుకే ఇప్పుడు ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో దాక్కున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించిన చంద్రబాబుకు... నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా?
‘‘మీరు ఓడిపోవడమేంటయ్యా’ అని అప్పడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది. నదులు, వాగులను తవ్వి ఏ ఇసుక నుంచి ధనరాశులు పోగు చేసుకున్నాడో ఇప్పుడు అవే ఇసుక బస్తాలతో కరకట్ట కొంపను వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో ఈ ఒక్క ఉదంతం చాలు. ప్రకృతితో పెట్టుకుంటే మటాశే బాబూ’ అని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు తీరును ఎండగట్టారు.
‘ఐదేళ్లుగా బాబు గారు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా? రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా, బాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు’ అని ఎల్లో మీడియా తీరుపై విమర్శలు గుప్పించారు. కాగా కృష్ణానది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉండటంతో.. ఆయన నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment