కాపు ఉద్యమ నేత ముద్మగడ పద్మనాభం(పాత చిత్రం)
కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మరో లేఖ సంధించారు. కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి గుర్తుచేశారు. తమ జాతికి విస్తరాకులు మాత్రమే వేశారు కానీ విస్తరాకులో ఏం వడ్డించలేదని వ్యంగ్యాత్మకంగా విమర్శించారు.
‘కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు. తమరు తీర్మానం చేసి పంపిన బిల్లును కేంద్రం నుంచి తిరిగి వచ్చిన సంగతి మీకు తెలియలేదా? ఇవాల్టికీ తహశీల్దారు కార్యాలయంలో మా జాతి బీసీ-ఎఫ్ ధృవీకరణ పత్రం పొందలేని పరిస్ధితి నెలకొంది. ఈ విషయాలు పక్కన పెట్టి అసెంబ్లీలో తమరు పచ్చి అబద్ధాలు చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. మీరు కష్టపడటం వల్ల రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సుఖశాంతులతో ఉన్నారని డబ్బా వాయిస్తున్నార’ని లేఖ ద్వారా ధ్వజమెత్తారు.
‘ఎవరూ, ఎక్కడా, ఏ జాతి సుఖంగా ఉందో చెప్పగలరా..?. తమ సహకారం ఉన్న కుటుంబాలు మాత్రమే సుఖంగా ఉన్నాయి. మాకు తెలిసీ తమ కుటుంబం, తమ సామాజిక వర్గంలో కొందరు తరతరాలుగా తరగని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా తమరికి వ్యతిరేకంగా మాట్లాడితే.. అతడు అమ్ముడు పోయాడని తమరి బృందం, మీడియాతో చెప్పిస్తార’ని విమర్శించారు.
అసెంబ్లీని మీ డబ్బా కొట్టుకోవాడానికి ఉపయోగించుకోకండి, అసెంబ్లీని దేవాలయంలా చూడండని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. తమరి పాలన చివరికి వచ్చింది కాబట్టి... మా జాతికి, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీతో పాటు మిగతా హామీలను అమలు చేయాలని కోరుతున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment