సాక్షి, రంగారెడ్డి: పురపోరుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ముందస్తు ప్రక్రియకు ఇటీవల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు నగారా మోగనుంది. నాలుగైదు రోజుల్లో తుది తీర్పు వెలువడనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ రెండు నెలల కిందటనే చేపట్టిన రాష్ట్ర మున్సిపల్ శాఖ.. ఓటర్ల తుది జాబితా రూపకల్పన, వార్డుల విభజన పూర్తిచేసింది. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు అంశం పెండింగ్‌లో ఉంది. దీనిపైనా అంతర్గతంగా ఆ శాఖ కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మున్సిపాలిటీల్లో రాజకీయంగా వేడి రాజుకుంది.
అన్ని పార్టీల నజర్..
రాష్ట్రంలోనే అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలున్న మన జిల్లాపై టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. అన్ని స్థానాల్లో పాగా వేయడానికి కసరత్తు చేస్తోంది. జిల్లాలో బండ్లగూడ, బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లతోపాటు 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా జిల్లాకు చెందిన నేతలతో టీఆర్‌ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంతనాలు జరిపారు. అలాగే ఎమ్మెల్యేలతోనూ ప్రత్యేకంగా సమావేశమై సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో బీజేపీ పట్టు సాధించే దిశగా పావులు కదుపుతుండటంతో మరింత వ్యూహాత్మకంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల బాధ్యతలను పార్లమెంట్ సభ్యులకు అప్పగించి అంతర్గతంగా ఎన్నికల కసరత్తు చేస్తోంది. మరోపక్క బీజేపీ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నేతలకు కాషాయ కండువా కప్పుతూ బలోపేతం అవుతోంది. ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్‌లను బీజేపీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఆ పార్టీ.. ఇతర ప్రాంతాలపైనా దృష్టిసారిస్తోంది. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నేతలకూ గాలం వేస్తోంది. టీఆర్‌ఎస్ వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇక.. కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటాన్ని అడ్డుకోలేకపోతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పటిష్టంగా ఉండటంతో ఆ ప్రాంత నేతలు పురపోరుపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలను హస్తంగతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాగా, టీడీపీ దాదాపుగా ఖాళీ కావడంతో ఆ పార్టీలో ఎన్నికల సందడి పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వారికి మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ విధానాలను ఎడగట్టడం ద్వారా తమకు కొంతైనా కలిసివస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
నేతల చుట్టూ ప్రదక్షిణలు..
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఆయా పార్టీల నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కార్పొరేటర్, కౌన్సిలర్, చైర్మన్‌ల పదవులకు కోసం వారి
చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోం ది. కొందరు ఆశావహులు నేరుగా ప్రజలను కలుస్తున్నారు. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి దసరా పండగ సందర్భంగా పలువురు ఆశావహులు ఆయా మున్సిపాలిటీల్లో వీధిలైట్లు వేయించడం, రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం వంటి పనులు విస్తృతంగా చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment