సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంటుందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ఓపక్క కరవు మండలాలు ప్రకటిస్తూ మరోపక్క వ్యవసాయ వృద్ధి రేటు దేశంలోకన్నా ఎక్కువని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి తక్కువగా 35.9 లక్షల హెక్టార్లు మాత్రమే సాగు జరిగిందని, పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పారు. గత ఏడాది రూ. 15 వేల కోట్ల మేర రైతాంగం నష్టపోయారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలో పూర్తిగా కరవుందని, రాయలసీమలో మైనస్ 47.6 వర్షపాతం నమోదైందన్నారు.
అనేక జిల్లాల్లో నారుమళ్లు దెబ్బతిన్నా కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాష్ట్రంలో 375 మండలాల్లో లోటు వర్షపాతమే ఉన్నా, కరవు జాబితాలో 275 మండలాలే చేర్చారని చెప్పారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 336 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గుంటూరు జిల్లాలో 23 కరువు మండలాలు ఉన్నాయని, శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 13 కరువు మండలాలు ఉంటే ఒక్కటి కూడా ప్రకటించలేదన్నారు. అందరినీ వంచిస్తున్న చంద్రబాబు చివరకు కరువు మండలాల ప్రకటనలో కూడా వంచించారని మండిపడ్డారు. కరువు మండలాల విషయంలో కేంద్రానికి వాస్తవ విషయాలు చెప్పకుండా బాబు దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కూడా ఇక్కడి కరువు చూసి కళ్ల నీళ్లు పెట్టుకుందని చెప్పారు.
ఈ ఏడాది సాగు విస్తీర్ణం లక్ష్యం 42.78 లక్షల హెక్టార్లయితే, ఇప్పటి వరకు 21.34 లక్షల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయని, నూనె గింజల సాగు లక్ష్యం 10.35 లక్షల హెక్టార్లయితే, 4.54 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగిందని, పప్పుధాన్యాలు 4.54 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంటే, కేవలం 1.54 లక్షల హెక్టార్లలోనే ఇంతవరకు సాగు చేశారని వివరించారు. జూలై 20 నాటికి రాయలసీమలో పప్పుధాన్యాలు, ఖరీఫ్ సాగుకు కట్ ఆఫ్ డేట్ అయిపోతుందని, ఆ తరువాత సాగు చేస్తే రైతులు మరింత నష్టపోతారన్నారు.
ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రత్యామ్నయ పంటలు వేసుకోండి అని ఉచిత సలహా ఇచ్చి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకుందన్నారు. రెయిన్‌గన్‌ల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టిన చరిత్ర టీడీపీ నేతలదని విమర్శించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి, పులిచింతల నుంచి నీళ్లెందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టు కావడం వల్లే దాని నుంచి నీళ్లు తీసుకున్నా బయటకు చెప్పడం లేదన్నారు. రాయలసీమ జిల్లాలను, ప్రకాశం జిల్లాను తక్షణమే కరువు జిల్లాలుగా ప్రకటించి, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన ప్రతీ జిల్లాలోని మండలాలను గుర్తించి ప్యాకేజీలు ఇవ్వాలన్నారు.
బాబు పాలనలో ఎప్పుడూ కరువే!
Published Sun, Aug 12 2018 4:23 AM | Last Updated on Sun, Aug 12 2018 4:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment