
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రం దుర్భిక్షాంధ్రప్రదేశ్‌గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో రెండెంకల వృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకోవడమే చంద్రబాబు రైతులకు చేసిన మేలు అని ఎద్దేవా చేశారు. నాగిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయం తిరోగమనంలో ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని తెలిపారు. చంద్రబాబు తన కరువు రికార్డులను తానే బద్ధలు కొడుతుంటారని నాగిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రైతన్నలకు సర్కారు సాయమేదీ?
రాష్ట్రంలో కరువు మండలాల ప్రకటనలోనూ ప్రభుత్వం వివక్ష చూపిందని నాగిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 394 కరువు మండలాలను ప్రకటించాలని ప్రభుత్వ అనుకూల మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. కానీ, 275 మండలాలు ఒకసారి, 21 మండలాలు మరోసారి కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అన్ని, విజయనగరంలో 6 మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖలు రాశారన్నారు. వాస్తవానికి గుంటూరు జిల్లాలో 14, విశాఖలో 10, విజయనగరంలో 12, శ్రీకాకుళం జిల్లాలో 14 మండలాలను ఇంకా కరవు మండలాలుగా ప్రకటించాల్సి ఉందన్నారు.
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 336 మండలాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొన్ని కరువు మండలాలు ప్రకటించినా, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదన్నారు. పంటలకు మద్దతు ధరలు దక్కకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు ఏమాత్రం సాయం చేయని చంద్రబాబు పోలవరం సందర్శనకు మాత్రం ఏకంగా రూ.20 కోట్లు కేటాయించి టీడీపీ కార్యకర్తలను బస్సుల్లో పంపడం అన్యాయమన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలోనూ ప్రభుత్వం రైతన్నను నిలువునా దగా చేస్తోందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ అందిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తర్వాత చంద్రబాబు యూనిట్ రూ.2కే ఇస్తానని ప్రకటించాడని, అది కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు.
దగా చేయడం బాబు నైజం
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను దగా చేయడం చంద్రబాబు నైజమని నాగిరెడ్డి మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని అన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా కరువు బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రబీ పంటకు కావాల్సిన విత్తనాలను 75 శాతం సబ్సిడీపై ఇవ్వాలన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన 141 మండలాల్లోని 2.15 లక్షల ఎకరాలకు సాయం అందించాలని పేర్కొన్నారు. రబీ సీజన్‌లోనైనా ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలన్నారు. జామాయిల్, సుబాబుల్‌ను టన్ను రూ.4,400 నుంచి 4,800కు కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆచారణకు నోచుకోలేదని, దీన్ని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.