
సాక్షి, తాడేపల్లి : వ్యవసాయం దండగ అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ముందుకు సాగుతాయని... కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాలు పథకాలు అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అర్హులైన రైతులకు రూ.12500 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదనంగా మరో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు నిర్ణయించారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టారని.. అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు.
బుధవారం నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో రైతు రుణాల అన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. రూ. 87 కోట్ల రుణమాఫీని చంద్రబాబు రూ. 15 వేలకు కుదించారు.. ఆయన పాలనలో భూములన్నింటినీ పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టారని విమర్శించారు. ‘మేము ఇస్తామన్న డబ్బు కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నాము. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేక పథకాలు అమలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు పుట్టుకతోనే వచ్చాయి. చంద్రబాబు కంటే పెద్ద కుట్రదారుడు ఎవరు ఉన్నారు. మేధావులు, పెద్దలు సూచన సలహాతోనే మూడు విడతులుగా రైతు భరోసా అందిస్తున్నారు. దేవినేని ఉమాకు వ్యవసాయ శాఖకు, వ్యవసాయ మిషన్‌కు తేడా తెలియడం లేదు. ప్రతీ కుటంబానికి భేషరుతుగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారు. ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు విడతలను ఎగ్గొట్టారు. చంద్రబాబుకు రైతులు బుద్ది చెప్పినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని ఇంటికి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మహిళలను మోసం చేశారు’ అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.
మేనిఫెస్టో స్పష్టంగా ఉంది..
సీఎం జగన్ హయాంలో అర్హులైన 51 లక్షల మంది రైతులకు, 3 లక్షల మంది కౌలు రైతులకు వైస్సార్ రైతు భరోసా అందుతోందని తెలిపారు. దేశంలో మొదటి సారిగా కౌలు రైతులకు రైతు భరోసాను సీఎం జగన్ అందజేస్తున్నారని తెలిపారు. ‘వైఎస్సాసీపీ మేనిఫెస్టో స్పష్టంగా ఉంది. చంద్రబాబు లాగా మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించలేదు. అయినా చంద్రబాబు శని ప్రభావంగా గతంలో వర్షాలు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి’ అని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment