
సాక్షి, విజయవాడ: మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆఖరి ప్రయత్నంగా.. మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశముందని, ఈ కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేసింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ అనుకూల అధికారుల బదిలీపై స్వయంగా సీఎం చంద్రబాబే నిరసనకు దిగి.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి.. ప్రశాంతతను చెడగొట్టేందుకు, ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్టు మీడియాకు ఇచ్చిన లీకుల ద్వారా తమకు సమాచారం అందిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి.. ద్వివేదికి రాసిన లేఖలో తెలిపారు. ఈ కుట్రలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా.. ఓటు హక్కు వినియోగించుకునేవిధంగా ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.