మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి(పాత చిత్రం)
ఢిల్లీ : హస్తినలో బీజేపీ మాజీ నేత నాగం జనార్దన్ రెడ్డి మకాం వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే బీజేపీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నాగం కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి కనబరుస్తుండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. నాగం రాకను కాంగ్రెస్‌లోని పలువర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నాగంను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ రాహుల్ గాంధీకి ఇటీవలే కొందరు నాయకులు ఫిర్యాదులు కూడా చేసిన సంగతి తెల్సిందే.
బీజేపీకి రాజీనామా చేసిన నాగం జనార్దనరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నాగంను చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో గుర్తింపు పొందిన నేత కాంగ్రెస్‌లో చేరారన్న భావన ప్రజల్లో కల్పించాలని పీసీసీ నాయకత్వం ఆలోచిస్తుండగా, పాలమూరు జిల్లాకు చెందిన నేతలు మాత్రం ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలు నాగం రాకను వ్యతిరేకిస్తూనే, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తుండడం పార్టీలో చర్చకు దారి తీస్తోంది.
తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాగం జనార్దనరెడ్డికి తనదైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన గత ఎన్నికలకు ముందే తెలంగాణ విషయంలో టీడీపీతో విభేదించి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా దామోదర్ రెడ్డిపై గెలిచిన అనంతరం బీజేపీలో చేరారు. 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాగం జనార్దనరెడ్డి కుమారుడు కూడా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీజేపీలో చేరిన ఆయనకు పార్టీలో ఎటువంటి కీలకమైన పదవులు దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింపులేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందనే ఆలోచనతో కొంతకాలం క్రితం పావులు కదిపారు. తనతోపాటు కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించారు.
Comments
Please login to add a commentAdd a comment