మహేశ్వరం: ప్రగతి నివేదన బహిరంగ సభకు అధికార దుర్వినియోగం ఎక్కడా చేయ లేదని, అన్ని ఖర్చులను పార్టీ యే భరిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన బహిరంగ సభ వేదిక వద్ద మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలతో కలసి ఆయన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రగతి నివేదన బహిరంగసభ కోసం ఒక్క అధికారినీ వినియోగించుకోలేదని, సభఖర్చును మొత్తం పార్టీనే భరి స్తోందని తెలిపారు.
ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సభకు ముందస్తు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. డబ్బులు పంపిణీ చేసే అలవాటు కాంగ్రెస్‌కే ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలతో దొరికి జైలుకూడు తిన్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే తమకంటే పెద్ద సభ నిర్వహించాలని సవాల్ విసిరారు. పర్యావరణాన్ని కాపాడేందుకు సభ అనంతరం భూమిని శుభ్రం చేస్తామని తెలిపారు.
ఐపీఎస్‌లకు ‘ప్రగతి నివేదన’ బాధ్యతలు
10 మంది ఇన్‌చార్జీల నియామకం
సాక్షి, హైదరాబాద్: ‘ప్రగతి నివేదన సభ’ బాధ్యతలను కొందరు ఐపీఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అప్ప గించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న వాహనాలను నియంత్రించడం, ప్రజలను లోపలికి అనుమతించడం, వారిని సమన్వయం చేయడంతోపాటు సభావేదికకు ఇన్‌చార్జీలుగా ఐపీఎస్‌లను నియమిస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రగతి నివేదన సభ కోఆర్డినేటర్‌గా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జితేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.
సభ ఇన్‌చార్జిగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సెక్యూరిటీ ఇన్‌చార్జిగా సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ ఇన్‌చార్జీలుగా అడిషనల్ సీపీ అనిల్ కుమార్, నల్లగొండ ఎస్పీ రంగనాథ్, సీఎం సెక్యూరిటీ, రూట్ క్లియరెన్స్ ఇన్‌చార్జిగా ఎస్పీ కోటిరెడ్డి, సభకు వచ్చేవారిని లోనికి అనుమతించే బాధ్యత వరంగల్ సీపీ రవీందర్, సభకు వచ్చేవారిని సమన్వయపరిచే బాధ్యతలను డీసీపీ జానకీ షర్మిల, ఎస్పీ శశిధర్‌రాజులకు అప్పజెప్పారు. సభావేదిక ఇన్‌చార్జిగా విక్రమ్‌జీత్ దుగ్గల్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment