సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలోని పలువురు ముఖ్య నేతల తీరుపై పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన ముందస్తు ఎన్నికల్లో గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తుంటే.. కొందరు నేతలు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల నేతల తప్పు డు విమర్శలపై కొందరు నేతలు ఏమీ మాట్లాడటం లేదని, అలాంటి వారికి గట్టిగా సమాధానం చెప్పాలని పలుసార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సాధారణ పరిస్థితుల్లో ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో అయినా తప్పుడు విమర్శలకు సమాధానం ఇవ్వకపోతే ఎలా అని పలువురు నేతలపై కేసీఆర్ మండిపడినట్లు తెలిసింది. పదవుల పరంగా, పార్టీ పరంగా గుర్తింపు పొందిన నేతలు సైతం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తమ వంతు పాత్ర పోషించడంలేదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారు. క్షేత్రస్థాయి ప్రచారంలో కీలకంగా వ్యవహరించడంలేదని, ప్రతిపక్ష పార్టీలను తిప్పిగొట్టే విషయంలో హైదరాబాద్‌లోని పార్టీ వేదికలపైనా మాట్లాడటంలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
చర్చ అంతా ప్రతిపక్షాల విమర్శలపైనే..
ముందస్తు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల కంటే ముందు న్న టీఆర్‌ఎస్‌కు ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా బహిరంగ సభలతో మంచి ఊపు వచ్చింది. నాలుగేళ్ల పాలనలో చేపట్టిన అంశాలు, మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలి పించాల్సిన ఆవశ్యకతపై కేసీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల్లోకి బాగా చేరాయి. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించిన సభలతో ఆ ప్రాంతాల్లో పార్టీకి ఊపు పెరిగింది.
మహబూబ్‌నగర్ బహిరంగ సభ తర్వాత ఆ ఉమ్మడి కాంగ్రెస్ నేతలు డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వా త మాజీ ఎంపీ మధుయాష్కీ సైతం ఇదే తరహా విమర్శలు చేశారు. సభల తర్వాత టీఆర్‌ఎస్‌కు వచ్చిన స్పందనపై జరగాల్సిన చర్చ ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలపైకి మళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నేతలను ఎదుర్కొనే విషయంలో టీఆర్‌ఎస్ నేతల తీరు అసంతృప్తిగా ఉంది. టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన వారి నేపథ్యం, కేసుల వంటి ఎన్నో అంశాలు ఉన్నా ముఖ్యనేతలు ఎవరూ స్పందించకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పల్లా తీరుపై అసహనం..
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు సైతం ప్రత్యర్థి పార్టీల కు దీటుగా సమాధానం చెప్పే ఆలోచన చేయకపోవడాన్ని టీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా మం చి అవకాశాలు పొందిన నేతలు సైతం ప్రతిపక్ష పార్టీ లను ఎదుర్కొనే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటంపై అధిష్టానం ముఖ్యులు అసంతృప్తితో ఉన్నారు.
సాధారణ ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి విషయం లో కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పదేపదే చెప్పినా ప్రతిపక్ష పార్టీల నేతలను ఖండించే విషయంలో పల్లా నిర్లక్ష్యంగా ఉంటున్నారని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. నల్లగొండ బహిరంగసభ ఏర్పాట్ల విషయంలోనూ పల్లా వైఖరిపై నల్లగొండ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేశారు.
కడియం వ్యవహారంపై అసంతృప్తి...
గతంలో వేరే పార్టీల్లో ఉండి ఎక్కువసార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్న పలువురు ఎమ్మెల్సీలు ఎన్నికల సమయంలో సొంత పనులకు పరిమితమవుతుండటాన్ని టీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. కడియం శ్రీహరి తీరుపైనా ఒకింత అసంతృప్తితోనే ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి టి.రాజయ్యకు వ్యతిరేకంగా జరుగుతున్న అసమ్మతి కార్యక్రమాల్లో కడియం అనుచరులు క్రీయాశీలకపాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్ అధిష్టానానికి సమాచారం అందించింది.
జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని కడియం ముఖ్య అనుచరులు రాజయ్యకు వ్యతిరేకంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారని గుర్తించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అనూహ్య అవకాశంతో ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన శ్రీహరి... స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసమ్మతి వ్యవహారాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిందిపోయి పట్టనట్లుగా ఉండటంపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలువురు చట్టసభల సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్ల విషయంలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఇదే అభిప్రాయంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment