మీకు తగిన శాస్తే జరిగింది! | will clear dust in mulkanur on 12th, says cm kcr | Sakshi
Sakshi News home page

మీకు తగిన శాస్తే జరిగింది!

Published Sun, Aug 9 2015 2:05 AM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM

మీకు తగిన శాస్తే జరిగింది! - Sakshi

మీకు తగిన శాస్తే జరిగింది!

ప్రతిపక్షాలపై కేసీఆర్ ఫైర్
* మిమ్ముల్ని అరెస్టు చేయకపోతే ఏం జేయాలె?
* సెక్రటేరియట్‌లో అడ్డం నిలబడితే స్టేషన్ల పెట్టక  ఏం జేస్తారు?
* కమ్యూనిస్టు సర్పంచులున్న చోట జీతాలు పెంచండి
* తెల్లారి నుంచే మేం పెంచుతాం


సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్న తమ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు.. కార్మికులను రెచ్చగొట్టి దిక్కుమాలిన సమ్మె చేయిస్తున్నాయని మండిపడ్డారు. సచివాలయంలో ధర్నాకు దిగిన ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సమర్థించారు.

‘‘ఏం పని లేక ఏదో ఒక పని కల్పించుకుని సెక్రటేరియట్‌కు వచ్చి దర్వాజకు అడ్డంగా నిలబడితే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ల పెట్టక ఏంజేస్తరు? మీకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ యూనియన్ బాజీలు, పనికిమాలిన దందాలు బంద్  పెట్టండి. ఇక మీ పప్పులుడకవ్. భయపడే ప్రభుత్వం ఇక్కడ లేదని హెచ్చరిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి, మహాసముద్రంగండి ప్రాజెక్టులను సందర్శించారు.

అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘ప్రతిపక్షాలను ఒక్క మాట అడుగుతున్నా.. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ దిక్కుమాలిన సమ్మె చేస్తుండ్రు కదా! కమ్యూనిస్టు సర్పంచులున్న చోట కార్మికులకు జీతాలు పెంచండి. తెల్లారి నుంచే మేం కూడా పెంచుతాం. ఎందుకంటే పారిశుధ్య కార్మికులకు ఏ గ్రామానికి ఆ పంచాయతీ, ఏ మున్సిపాలిటీ కార్మికులకు ఆ మున్సిపాలిటీయే జీతాలిస్తుంది తప్ప ప్రభుత్వం కాదు. 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా జీతాలు ఇస్తున్నదా?’’ అని ప్రశ్నించారు.
 
వారి జీవితాలు నాశనం చేస్తున్నాయి..
ప్రభుత్వ కార్యక్రమాలను చూసి ఓర్వలేక అడ్డగోలు సమ్మె చేస్తూ ప్రతిపక్షాలు కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నాయని సీఎం దుయ్యబట్టారు. నిన్నటి వరకు పంచాయతీల్లో జీతాల కోసం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసే అధికారం ఉండేదని, తాను దాన్ని 50 శాతం ఖర్చు చేసే అధికారమిచ్చానని చెప్పారు. కార్మికులు యూనియన్లు, ప్రతిపక్షాల మాటలు వినకుండా విధుల్లో చేరి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.

కార్మికులతో సమ్మె చేయించిన ప్రతిపక్షాలే వారి చేత సమ్మెను విరమింపజేయాలని కోరితే.. విపక్షాలు మాత్రం ‘సమ్మె మేం చేయించినా.. మీరే పరిష్కరించాలి’ అని చెబుతున్నాయన్నారు. అందుకే వారు కోరినా తాను ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదన్నారు. అయినా పని కల్పించుకుని సచివాలయానికి వచ్చి ధర్నా చేసి అరెస్టయ్యారన్నారు. ‘‘ప్రజలు మాకు అధికారమిచ్చిండ్రు. తప్పు చేస్తే మాకు శిక్ష విధిస్తరు. అంతవరకు ఎదురుచూడాలేగానీ.. పొద్దున లేస్తే ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తే ఎట్లా? మీ పుణ్యమా అని జీహెచ్‌ఎంసీలో వెయ్యి మంది కార్మికుల ఉద్యోగాలు పోయినయ్. ఇకనైనా మీ యూనియన్ బాజీలు... పనికిమాలిన దందాలు బంద్ జేసుకోవాలె’’ అని అన్నారు.
 
గ్రామజ్యోతి ద్వారా రూ.30 వేల కోట్లు

గ్రామజ్యోతిలో భాగంగా నాలుగేళ్లలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు సీఎం చెప్పారు. రోడ్లు ఇతరత్రా అభివృద్ధి నిధులు కాకుండా నియోజకవర్గానికి రూ.300 కోట్ల చొప్పన ఒక్కో జిల్లాకు సగటున రూ.2,500 కోట్లు వస్తాయన్నారు. ఆ నిధులను పార్టీలతో పనిలేకుండా గ్రామాల జనాభా ఆధారంగా ఖర్చు చేస్తామన్నారు.

రాష్ట్రంలో 45 ఏళ్లకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, 16 ఏళ్లపాటు పాలించిన తెలుగుదేశం నాయకులు సాగునీటి ప్రాజెక్టులను అడ్డగోలుగా డిజైన్ చేశారని విమర్శించారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తామన్నారు. కాగా, కరీంనగర్ జిల్లా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ రాత్రి 9 గంటల ప్రాంతంలో నేరుగా మెదక్‌జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.
 
తట్ట మోస్తా.. మోరీ పని చేస్తా!
తాను దత్తత తీసుకున్న కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరును అద్దంలా తీర్చిదిద్దేందుకు తట్ట మోస్తానని సీఎం వ్యాఖ్యానించారు. శనివారం గ్రామానికి వచ్చిన కేసీఆర్ రెండున్నర గంటలు అక్కడే గడిపారు. తొలుత గ్రామంలోని వాడవాడలా కలియదిరిగారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామసభ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘‘చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్న. ఊరు ఊరంతా ఇక కదలాలి. ఊరిలో చెత్తపై యుద్ధం చేయాలి.

ఈనెల 12న ఊరిని శుభ్రం చేద్దాం. ఆరోజు మీతోపాటు నేనూ వస్తా. నా వంతుగ 50 తట్టల మట్టి మోస్తా. అవసరమైతే మోరీ పని కూడా చేస్తా. పనయ్యాక నా సొంత డబ్బుతో ఊరోళ్లందరికీ భోజనాలు పెట్టిస్తా’’ అని చెప్పారు. ఇకపై ప్రతినెలా ఒకరోజు గ్రామాభివృద్ధి కోసం శ్రమదానానికి సిద్ధం కావాలని కోరారు. ఈనెల 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లెలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గ్రామజ్యోతి సందర్భంగా ఏమేం చేయాలో తెలియజేప్పేందుకే ఇతర జిల్లాలకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఇక్కడికి తీసుకొచ్చినట్లు చెప్పారు.
 
నువ్వు గుడుంబా అమ్ముతున్నవట గదా..?
ముల్కనూర్‌లో పాడుబడ్డ బావులను, కూలిన ఇళ్లను, మురికి కాల్వలను సీఎం పరిశీలించారు. ఎల్లోజు సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వివరాలు అడిగారు. ‘సార్ మాకు ఇల్లు లేదు.. రేకుల షెడ్‌లో ఉంటున్నాం’ అని ఆయన చెప్పగా.. ‘తక్షణమే నీకు డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తా’ అని చెప్పారు. రాజేశ్వరీ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ వస్తుందా అని ఆమెను ఆరా తీశారు.

‘పింఛన్ వస్తోంది కానీ.. బియ్యం వత్తలేవు బాంచెన్..’ అని ఆమె పేర్కొంది. ‘నీవు గుడుంబా అమ్ముతున్నవట గదా..’ అని సీఎం ఆమెను ప్రశ్నించగా ‘ఎన్నడో మూడు నెల్లకిందనే బంద్ చేసిన బాంచెన్’ అని ఆమె చెప్పగా.. ‘మళ్లీ అమ్మితే నీపై కేసుపెడతా..’ అని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement