సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. కరోనా లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఆదా యం గాడి తప్పడంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో గత 3 నెలలుగా కోత విధిస్తూ వచ్చిన ప్రభుత్వం... ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుండటంతో ఈ నెల కోతల్లేకుండా పూర్తి వేతనం, పెన్షన్లను జూలైలో చెల్లించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంగళవారం ఆదేశించారు.
ఖాళీ ఖజానాతో తప్పని కోతలు...
కరోనా కట్టడి కోసం మార్చి 24న రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను 25 శాతం, నాలుగవ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కోతలు అమల్లోకి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ జీతాలు, పెన్షన్లలో ప్రభుత్వం కోతలను అమలు పరిచింది.
అయితే ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధతను ప్రశ్నించి హైకోర్టు... పెన్షన్లలో కోతను తప్పుబట్టింది. దీంతో విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కోతలకు చట్టబద్ధత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన తెలియజేశాయి. అయితే కేవలం హైకోర్టు కేసు కోసమే అత్యవసరంగా ఈ ఆర్డినెన్స్ తెచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం... ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం, పెన్షన్లను చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించినట్లు అయింది.
మంత్రి హరీశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి తమకు పూర్తి వేతనాలు చెల్లించాలని, కోత పెట్టిన మూడు నెలల వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన హరీశ్... ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ జూన్ నుంచి పూర్తి వేతనాలు, పెన్షన్లు ఇస్తామని, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోత విధించిన వేతనాల బకాయిలను మాత్రం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అయితే సీపీఎఫ్ ఉద్యోగులు, పెన్షనర్లకు జీపీఎఫ్ ఉండదని ఉద్యోగ నేతలు మంత్రి దష్టికి తీసుకెళ్లగా... వారి బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకరించారు. మంత్రిని కలిసిన వారిలో ఐక్య వేదిక నాయకులు చిలాగాని సంపత్‌కుమారస్వామి, జంగయ్య, చావ రవి, సదానందగౌడ, పురుషోత్తమ్, వెంకట్‌రెడ్డి, విఠల్, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment