telangana govt employees
-
రేవంత్ సర్కార్‌పై హరీష్‌రావు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు పాలన నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుంటే ఉద్యమం చేస్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇక, తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ, ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.… — Harish Rao Thanneeru (@BRSHarish) February 22, 2024 -
తెలంగాణ: 2023లో ప్రభుత్వ సెలవు దినాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-2023లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం ఏడాదిలో 28 సాధారణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలిపింది. సాధారణ సెలవులు 4 ఆదివారాల్లో, 2 రెండో శనివారాల్లో వస్తున్నాయి. ఈ మేరకు సెలవుల జాబితాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలిపారు. మతం, ఉత్సవంతో సంబంధం లేకుండా 24 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా ఏవైనా 5 ఐచ్ఛిక సెలవులను వాడుకోవడానికి అనుమతించారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్–ఉన్–నబీ పర్వదినాల సెలవుల్లో ఏమైనా మార్పులుంటే తర్వాత ప్రకటిస్తారు. సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్, విద్యాసంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవులు వర్తించవు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఈ సంస్థలు అమలు చేయాల్సిన సెలవుల విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయని సీఎస్ తెలిపారు. సాధారణ సెలవులు 4 ఆదివారాల్లో, 2 రెండో శనివారాల్లో వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవంగా లభించనున్న సాధారణ సెలవుల సంఖ్య 22కి తగ్గనుంది. కాగా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద 23 సెలవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. -
సాగునీటి శాఖలో 700 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు 378 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. ఈ పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టులు కలిపి మొత్తంగా శాఖ పరిధిలో 1,167 ఖాళీలున్నట్లు ఇరిగేషన్ శాఖ గుర్తించింది. ఇందులో తొలి విడతలో భాగంగా 700 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. భర్తీ చేయనున్న ఏఈఈ పోస్టుల్లో సివిల్‌కు సంబంధించి 310, మెకానికల్ 58, ఎలక్ట్రికల్ 200 ఉండనున్నాయి. -
ఈ నెల పూర్తి వేతనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. కరోనా లాక్డౌన్ వల్ల రాష్ట్ర ఆదా యం గాడి తప్పడంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో గత 3 నెలలుగా కోత విధిస్తూ వచ్చిన ప్రభుత్వం... ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుండటంతో ఈ నెల కోతల్లేకుండా పూర్తి వేతనం, పెన్షన్లను జూలైలో చెల్లించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. ఖాళీ ఖజానాతో తప్పని కోతలు... కరోనా కట్టడి కోసం మార్చి 24న రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను 25 శాతం, నాలుగవ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కోతలు అమల్లోకి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ జీతాలు, పెన్షన్లలో ప్రభుత్వం కోతలను అమలు పరిచింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధతను ప్రశ్నించి హైకోర్టు... పెన్షన్లలో కోతను తప్పుబట్టింది. దీంతో విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కోతలకు చట్టబద్ధత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన తెలియజేశాయి. అయితే కేవలం హైకోర్టు కేసు కోసమే అత్యవసరంగా ఈ ఆర్డినెన్స్ తెచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం... ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం, పెన్షన్లను చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించినట్లు అయింది. మంత్రి హరీశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి తమకు పూర్తి వేతనాలు చెల్లించాలని, కోత పెట్టిన మూడు నెలల వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన హరీశ్... ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరికీ జూన్ నుంచి పూర్తి వేతనాలు, పెన్షన్లు ఇస్తామని, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోత విధించిన వేతనాల బకాయిలను మాత్రం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అయితే సీపీఎఫ్ ఉద్యోగులు, పెన్షనర్లకు జీపీఎఫ్ ఉండదని ఉద్యోగ నేతలు మంత్రి దష్టికి తీసుకెళ్లగా... వారి బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకరించారు. మంత్రిని కలిసిన వారిలో ఐక్య వేదిక నాయకులు చిలాగాని సంపత్‌కుమారస్వామి, జంగయ్య, చావ రవి, సదానందగౌడ, పురుషోత్తమ్, వెంకట్‌రెడ్డి, విఠల్, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. -
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల (జూన్) పూర్తి వేతనం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో గత మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు 50 శాతం వేతనాలు మాత్రమే చెల్లిస్తోంది. అయితే ఈ విషయంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ధర్మాసనం కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. (చదవండి : కీలక భేటీ వాయిదా.. బస్సు ప్రయాణికులకు నిరాశ) ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. లాక్డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రతినిధుల సంబంధించి మాత్రం ఇదివరకు అమలులో ఉన్న 75శాతం కోత విధానాన్ని మరి కొంత కాలం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
మార్చిలో పీఆర్సీ అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకొని వచ్చే నెలలో అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. పీఆర్సీ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక పీఆర్సీ రాదేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని జేఏసీ పేర్కొంది. బుధవారం సచివాలయంలో సోమేశ్‌కుమార్‌ను జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, ఎ. సత్యనారాయణ, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకొని పీఆర్సీని ప్రకటిస్తామని, పదవీ విరమణ వయస్సును పెంచుతామని సీఎం హామీ ఇచ్చారని.. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎస్‌ను కోరామన్నారు. పీఆర్సీని ఒక్క వేతన సవరణ కోసం వేయలేదని, ఉద్యోగుల అనేక విషయాలపై స్టడీ కోసం ఏర్పాటు చేశారన్నారు. ఆ స్టడీ పూర్తి కానందునే పొడిగించారన్నారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, నెల లోపల కమిషన్ రిపోర్ట్ అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒకవేళ పీఆర్సీ ప్రకటించకపోతే పోరాటం చేస్తామన్నారు. ఈహెచ్ఎస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కిందిస్థాయి ఉద్యోగులకు ఇవ్వాలని కోరామని వారు చెప్పారు. గడువు పెంపుపై ఆందోళన వద్దని సీఎస్ చెప్పారని వెల్లడించారు. వేతన సవరణకు ఈ గడువుతో సంబంధం లేదని చెప్పారన్నారు. పీఆర్సీ ఒక్కటే కాకుండా సర్వీసు రూల్స్ సవరణ, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో కేడర్ స్ట్రెంత్ ఖరారుకు గడువును పెంచామని చెప్పారన్నారు. వేతన సవరణకు సంబంధించి నివేదికను వెంటనే తెప్పించుకుంటామని, సీఎం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతుందని హామీ ఇచ్చారన్నారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ అవుతుందని నేతలు వివరించారు. 27 శాతం ఐఆర్ ప్రకటించాలి.. వేతన సవరణ కమిషన్ గడువు పొడిగించినందున ప్రభుత్వం వెంటనే 27 శాతం మధ్యంతర భృతిని (ఐఆర్) ప్రకటించాలని పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను విజ్ఞప్తి చేశారు. వారు బుధవారం సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. -
ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను రప్పించండి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పని చేస్తున్న తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో సంఘం నగర శాఖ కార్య వర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి ఐదేండ్లు దాటినప్పటికీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. నేటికీ 450 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారని చెప్పారు. చాలీచాలని వేతనంతో వారు అక్కడ ఉండలేక, రాష్ట్రానాకి రాలేక నిత్యం మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి ఆ రాష్ట్రంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏ, ఐఆర్ ఇవ్వాలని ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, నగర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్యదర్శి అతిక్ పాషా, కోశాధికారి అండ్రూస్, సహ అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు రాజేందర్, వెంకటేష్, యాదమ్మ, ముజీబ్, వందన, కస్తూరి పాల్గొన్నారు. -
జీతంలో నుంచి 10 వేలు చేతికి
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తీసుకునే వెసులుబాటు అన్ని జాతీయ, ఏజెన్సీ బ్యాంకుల్లో సదుపాయం.. అవసరమైతే బ్యాంకుల పనివేళల పొడిగింపు అన్ని శాఖలకు ఆర్థిక శాఖ మెమో సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! బ్యాంకుల్లో నోట్ల కొరత ఉన్న దృష్ట్యా డిసెంబర్ 1న తమ వేతనంలో నుంచి రూ.10 వేల నగదు తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక లైన్ల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు చెల్లింపులు చేసేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. అవసరమైతే బ్యాంకు పని వేళలను పొడిగించి ఈ చెల్లింపులు చేస్తారు. ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్తోపాటు అన్ని జాతీయ బ్యాంకులు, ఏజెన్సీ బ్యాంకుల్లో ఈ సదుపాయం ఉంటుంది. ఒకేసారి అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించు కోవాలని సూచిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలు, హెచ్వోడీలకు మంగళవారం సాయంత్రం మెమో జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, డీటీవోలు, ఎస్టీవోలందరికీ ఈ సమాచారం చేరవేశారు. నవంబర్ నెల ఉద్యోగుల జీతాలకు సరిపడే నిధులను తెలంగాణ ఆర్థిక శాఖ విడుదల చేసింది. డిసెంబర్ ఒకటో తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు జమవుతుంది. పెద్ద నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో నగదు విత్‌డ్రాపై ప్రస్తుతం ఆర్బీఐ విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఖాతాదారులు ఏటీఎంల ద్వారా రూ. 2,500, బ్యాంకులకు వెళ్లి చెక్కు ద్వారా రూ. 10 వేలు డ్రా చేసుకునే వీలుంది. ఒక వారంలో రూ. 24 వేలు మించకుండా డ్రా చేసుకోవాలన్న ఆంక్షలున్నాయి. దీంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఖాతాదారులు గంటల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటో తారీఖున తమ కనీస అవసరాలకు సరిపడే డబ్బును జీతం నుంచి తీసుకునే పరిస్థితి లేదని, జీతంలో కొంత మొత్తం నగదుగా చెల్లించాలని టీఎన్జీవో ప్రతినిధులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్బీఐతోపాటు బ్యాంకర్లతో చర్చలు జరిపి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేయించింది. -
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
-
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. వచ్చే నెల 1న ఉద్యోగులకు జీతంలో 10 వేల రూపాయలు నగదు చేతికిచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించింది. దేశమంతా నోట్ల కష్టాలతో అల్లాడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం తెలంగాణ ఉద్యోగులకు ఊరట కలిగించనుంది. పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ చూసిన ‘నో క్యాష్’ బోర్డులు దర్శమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ఉద్యోగ సంఘాలు ఆర్బీఐకి విజ్ఞప్తి చేశాయి. మరోవైపు సర్కారు బ్యాంకుల్లో ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.