సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-2023లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం ఏడాదిలో 28 సాధారణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలిపింది. సాధారణ సెలవులు 4 ఆదివారాల్లో, 2 రెండో శనివారాల్లో వస్తున్నాయి.
ఈ మేరకు సెలవుల జాబితాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలిపారు. మతం, ఉత్సవంతో సంబంధం లేకుండా 24 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా ఏవైనా 5 ఐచ్ఛిక సెలవులను వాడుకోవడానికి అనుమతించారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్–ఉన్–నబీ పర్వదినాల సెలవుల్లో ఏమైనా మార్పులుంటే తర్వాత ప్రకటిస్తారు. సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి.
పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్స్, విద్యాసంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవులు వర్తించవు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఈ సంస్థలు అమలు చేయాల్సిన సెలవుల విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయని సీఎస్ తెలిపారు. సాధారణ సెలవులు 4 ఆదివారాల్లో, 2 రెండో శనివారాల్లో వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవంగా లభించనున్న సాధారణ సెలవుల సంఖ్య 22కి తగ్గనుంది. కాగా, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద 23 సెలవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.
Comments
Please login to add a commentAdd a comment