ఇబ్రహీంపట్నం రూరల్: టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. 9 రోజులుగా చేస్తున్న పనులు కొలిక్కి వచ్చాయి. సెప్టెంబర్ 2న కొంగర కలాన్‌లో నిర్వహించే సభాస్థలానికి ఒక స్వరూపం వచ్చింది. 48 గంటల్లో సభ జరగబోతున్న తరుణంలో దాదాపు 80 శాతం పనులు పూర్తిచేశారు. గురువారం ఉదయం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు.
మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ వచ్చి పనులను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాక కోసం ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ పక్క నుంచే 60 అడుగుల వెడల్పు రోడ్డును ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధం చేశారు. నారాయణ కళాశాల వెనకాల నుంచి వండర్ లా మీదుగా సభాస్థలికి చేరుకోవడానికి వీలుగా రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు సుమారు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది దగ్గరుండి పనులు చూస్తున్నారు.
హెలికాప్టర్ ట్రయల్ రన్ ...
ముఖ్యమంత్రి రోడ్డు మార్గంతోపాటు హెలికాప్టర్‌లో సభాస్థలికి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సభాస్థలం వెనకాల ఆర్‌అండ్‌బీ అధికారులు హెలిప్యాడ్ సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం సీఎం సెక్యూరిటీ అధికారి ఎస్‌కే సింగ్ ట్రయల్ వేశారు. కొద్దిసేపు సభాస్థలం పరిశీలించి వెళ్లిపోయారు. సభకు వచ్చేవారికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సభాస్థలంలో వేసిన బారికేడ్లల్లో వాటర్ ప్యాకెట్లను ఉంచారు. రెండు డీసీఎంల నిండా ఒక్కో సంచిలో 100 ప్యాకెట్ల చొప్పున తరలించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల కోసం తాగునీరు సిద్ధంగా ఉంచారు.
గ్రీన్‌కార్పెట్.. 10 వేల కుర్చీలు
ప్రగతి సభకు హాజరయ్యే జనం కూర్చోవడానికి 10 వేల కుర్చీలను ఏర్పాటు చేశారు. మిగతా ప్రదేశాల్లో 50 వేల చదరపు మీటర్ల గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దానిని కింద పరిచే పనిలో ఉన్నారు. వేదిక మీద నుంచి ప్రతినిధుల ప్రసంగాలను సభికులు వినడానికి అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 30 ఫ్లైయింగ్ సిస్టమ్స్, 500 మైక్‌సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 300 ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సభను వీక్షించడానికి వెసులుబాటు కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment