టీఆర్‌ఎస్ ‘రైతు’ సభ!
♦ ఆవిర్భావ సభను వినూత్నంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయం
♦ రైతులను భారీ సంఖ్యలో సమీకరించే ప్రయత్నం
♦ ఒక్కో పూర్వపు జిల్లా నుంచి వెయ్యి ట్రాక్టర్లు
♦ 20 లక్షల మందితో సభకు ప్రణాళిక
♦ నియోజకవర్గాల్లో మంత్రుల సమీక్ష.. విజయవంతానికి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 16వ ఆవిర్భావ సభను వినూత్నంగా నిర్వహించాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయించింది. బహిరంగ సభకు భారీ సంఖ్యలో రైతులను సమీకరించే పనిలో పడింది. ఇందుకోసం మంత్రులు ఆయా జిల్లాల్లో ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమీక్షలు జరుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల కంటే మూడేళ్ల తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు ఎక్కువని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. దీంతో వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ సభకు రైతులను ట్రాక్టర్లలో తరలించాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా ఒక్కో జిల్లా (పాత) నుంచి కనీసం వెయ్యి ట్రాక్టర్లలో రైతులను సభకు తరలించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ఒక్కో పంటకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు సాయం చేస్తామని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 21న జరిగిన పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి కూడా కేసీఆర్ మరోమారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతాంగం కోసం తీసుకుంటున్న ఈ పథకం దేశానికే మార్గదర్శిగా నిలుస్తుందని పార్టీ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని వర్గాల్లోకి తీసుకుపోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావ సభను కనీసం 20 లక్షల మందితో ‘రైతు సభ ’గా జరపాలని నిర్ణయించారు.
రెండు రోజుల ముందే పయనం
దేశ చరిత్రలోనే ఒక సభకు వేలాది ట్రాక్టర్లలో రైతులు తరలివెళ్లడం మొదటిసారి కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాత వరంగల్ జిల్లా, దాని సమీప జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి ఎడ్లబండ్లలో రైతులను సభకు తరలించనున్నారు. వరంగల్‌కు దూరంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల నుంచి సభ జరగడానికి రెండు రోజుల ముందే రైతులు బయలుదేరేలా ప్లాన్ చేశారు.
కొన్ని జిల్లాల నుంచి మంగళవారమే (25వ తేదీ) పయనం కానున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందు ఉదయం 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 తర్వా త ట్రాక్టర్లు ప్రయాణం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గ ట్రాక్టర్లలోనే ప్రయాణించనున్నారని చెబుతున్నారు.
జిల్లాల్లో సమీక్షలు షురూ!
బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలను మాత్రమే కాకుండా రైతులను కూడా తరలించాలని నిర్ణయించిన క్రమంలో జిల్లాల్లో మంత్రులు సమీక్షలు మొదలుపెట్టారు. ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందూలాల్ తదితరులు తమ సొంత నియోజకవర్గాల్లోకార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను సోమవారం నిర్వహించారు. ప్రధానంగా రైతులను ట్రాక్టర్లలో తరలించే అంశంపై సమీక్షించా రు. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, పాలమూరు వంటి జిల్లాల్లో ఎత్తిపోతల పథకాల పూర్తి, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయిల చెల్లింపు తదితర రైతు సంబంధ నిర్ణయాలకు విస్తృతమైన ప్రచా రం కల్పించాలన్న వ్యూహంతోనే సభకు రైతులను సమీకరిస్తున్నట్లు సమాచారం.