progress reports
-
సభకు సర్వం సిద్ధం
ఇబ్రహీంపట్నం రూరల్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. 9 రోజులుగా చేస్తున్న పనులు కొలిక్కి వచ్చాయి. సెప్టెంబర్ 2న కొంగర కలాన్‌లో నిర్వహించే సభాస్థలానికి ఒక స్వరూపం వచ్చింది. 48 గంటల్లో సభ జరగబోతున్న తరుణంలో దాదాపు 80 శాతం పనులు పూర్తిచేశారు. గురువారం ఉదయం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ వచ్చి పనులను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాక కోసం ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ పక్క నుంచే 60 అడుగుల వెడల్పు రోడ్డును ఆర్అండ్బీ అధికారులు సిద్ధం చేశారు. నారాయణ కళాశాల వెనకాల నుంచి వండర్ లా మీదుగా సభాస్థలికి చేరుకోవడానికి వీలుగా రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు సుమారు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది దగ్గరుండి పనులు చూస్తున్నారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ ... ముఖ్యమంత్రి రోడ్డు మార్గంతోపాటు హెలికాప్టర్లో సభాస్థలికి వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సభాస్థలం వెనకాల ఆర్అండ్బీ అధికారులు హెలిప్యాడ్ సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం సీఎం సెక్యూరిటీ అధికారి ఎస్కే సింగ్ ట్రయల్ వేశారు. కొద్దిసేపు సభాస్థలం పరిశీలించి వెళ్లిపోయారు. సభకు వచ్చేవారికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సభాస్థలంలో వేసిన బారికేడ్లల్లో వాటర్ ప్యాకెట్లను ఉంచారు. రెండు డీసీఎంల నిండా ఒక్కో సంచిలో 100 ప్యాకెట్ల చొప్పున తరలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసం తాగునీరు సిద్ధంగా ఉంచారు. గ్రీన్‌కార్పెట్.. 10 వేల కుర్చీలు ప్రగతి సభకు హాజరయ్యే జనం కూర్చోవడానికి 10 వేల కుర్చీలను ఏర్పాటు చేశారు. మిగతా ప్రదేశాల్లో 50 వేల చదరపు మీటర్ల గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దానిని కింద పరిచే పనిలో ఉన్నారు. వేదిక మీద నుంచి ప్రతినిధుల ప్రసంగాలను సభికులు వినడానికి అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 30 ఫ్లైయింగ్ సిస్టమ్స్, 500 మైక్సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 300 ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సభను వీక్షించడానికి వెసులుబాటు కల్పించనున్నారు. -
దారులన్నీ కొంగర కలాన్ వైపే..
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 2 ఆదివారం. వీకెండ్‌కు కుటుంబ సభ్యులతో సరదాగా బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. సిటీ బస్సులోనో, క్యాబ్‌లోనో ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నారా... వచ్చే ఆదివారం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారా.. అయితే, మీ వీకెండ్ టూర్‌ను తప్పకుండా వాయిదా వేసుకోవలసిందే! సొంత వాహనం ఉంటే తప్ప ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ రోజు ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు మినహా చాలా వరకు రోడ్డు రవాణా సదుపాయాలు స్తంభించే అవకాశం ఉంది. అత్యధిక వాహనాలు కొంగరకలాన్ వైపు దారులకు బారులు తీరనున్నాయి. సెప్టెంబర్ 2న కొంగర కలాన్‌లో టీఆర్ఎస్ నిర్వహించే ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభకు జనసమీకరణ కోసం వాహనాల సేకరణలో పార్టీనేతలు , ఆర్టీఏ అధికారులు తలమునకలై ఉన్నారు. హైదరాబాద్ నుంచే 50 వేలకుపైగా వాహనాలను ఈ సభకు తరలించనున్నారు. ఈ దిశగా ఆర్టీఏ, తదితర విభాగాల అధికారయంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. ఆర్టీసీ బస్సులతోపాటు, స్కూల్ బస్సులు, వ్యాన్లు, డీసీఎంలు, మెటడోర్లు, క్యాబ్‌లు, ట్రావెల్ బస్సులు, కార్లు, ఆటోలు తదితర అన్ని రకాల వాహనాలను సభ కోసం ముందస్తుగా బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం అత్యవరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. రూటు మారనున్న సిటీ బస్సులు.... గ్రేటర్ హైదరాబాద్‌లో రోజూ 3,550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1,050 రూట్లలో, 42 వేల ట్రిప్పులు తిరిగే సిటీ బస్సుల్లో రోజుకు 32లక్షల మంది ప్రయాణికు లు రాకపోకలు సాగిస్తారు. నగరంలోని అన్ని మారుమూల కాలనీలకు, శివారు ప్రాంతాలకు సిటీ బస్సు రవాణా ఉంది. సభ దృష్ట్యా 2,500కు పైగా బస్సులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సిటీ బస్సుల్లో తిరిగే సుమారు 20లక్షల మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్లు, ప్రధాన బస్స్టేషన్లు, ఆస్పత్రులకు వెళ్లే మార్గాల్లో కూడా బస్సు లు, క్యాబ్‌ల కొరత వల్ల ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగానే ఉంటుంది. స్కూల్ బస్సులన్నీ అటు వైపే... సాధారణంగా మోటారు వాహన నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు తదితర విద్యాసంస్థలకు నడిపే బస్సులను ఇతర అవసరాలకు వినియోగించేందుకు అవకాశం లేదు. స్కూల్ బస్సులను పెళ్లిళ్లు, వేడుకలు, టూర్ల కోసం వినియోగించిన అనేక సందర్భాల్లో రవాణా అధికారులు కేసులు నమోదు చేస్తారు. పిల్లల భద్రత దృష్ట్యా వాటిని ఇతర అవసరాల కోసం వినియోగించవద్దనే నిబంధన ఉంది. కానీ, రవాణా అధికారులే ఆ నిబంధనలను పక్కన పెట్టి స్కూల్ బస్సులను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు. స్కూళ్లు, కళాశాలలు, తదితర విద్యాసంస్థలకు చెందిన సుమారు 10 వేల బస్సులను తరలించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ప్రైవేట్ బస్సులను కూడా ఈ సభ కోసం తరలించనున్నారు. దూరప్రాంతాలకు కూడా ఆటంకమే... తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులన్నీ ఆదివారం కొంగరకలాన్‌కే దారితీయనున్నాయి. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ తదితర బస్స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 2000లకు పైగా ఆర్టీసీ బస్సులు కూడా స్తంభించనున్నాయి. దీంతో ఆదివారం పూట దూరప్రాంతాల ప్రయాణాలను కూడా ఉపసంహరించుకోవడం మంచిదని అధికారవర్గాలు సూచిస్తున్నాయి. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లే దిక్కు రోడ్డు రవాణా సదుపాయాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉండడంతో నగరవాసులకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయం ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు మాత్రమే. కానీ, వాటి సేవలు పరిమితం. ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి మార్గంలో, నాంపల్లి– లింగంపల్లి–ఫలక్‌నుమా మార్గంలో మాత్రమే ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నాయి. రోజుకు లక్షా 60 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఉప్పల్–అమీర్‌పేట్–మియాపూర్ రూట్లో తిరుగుతున్న మెట్రో రైళ్లలో రోజుకు 80 వేల మంది తిరుగుతున్నారు. ఈ రెండు రకాల రైలు సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ రోజు ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రగతి నివేదన సభకు అనుమతి రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ పేరు తో సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్ వద్ద నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సభకిచ్చిన అనుమతులను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన నడిగడ్డ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. సభ పేరిట 25లక్షల మందిని ఒకచోట చేర్చే బదులు తమ పార్టీ పాలనలో సాధించిన ఘన విజయాలను తెలియచేసేందుకు ప్రత్యామ్నాయాలను చూసుకునేలా టీఆర్ఎస్ను ఆదేశించాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సీఎస్, డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ రామ సుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ ప్రస్తావించారు. కేసు ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని నివేదించారు. దీంతో ధర్మాసనం వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. ప్రగతి నివేదన సభ కోసం 1600 ఎకరాలను చదును చేస్తున్నారని, ఇందులో ఉన్న చెట్లన్నింటినీ నరికేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఈ సభకు 25 లక్షల జనాన్ని సమీకరించాలని అధికార పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని, దాదాపు లక్ష వాహనాలను వినియోగించనున్నారన్నా రు. ఈ సభ వల్ల సామాన్య ప్రజానీకం రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. దాదాపు రూ.200 కోట్లను ఖర్చు చేస్తూ నిర్వహిస్తున్న సభ లక్ష్యం ప్రభుత్వం ఘన విజయాలను ప్రజలకు తెలియచేయడమేనన్నారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వంటి సాధానాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ సభ వల్ల పంటలకు, ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా నష్టం వాటిల్లితే దానిని టీఆర్ఎస్ నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రస్ రిపోర్ట్ అచ్చెన్నాయుడు
-
ప్రోగ్రెస్ రిపోర్టును బట్టే మంత్రి పదవులు!
మంత్రివర్గాన్ని యథాతథంగా ఉంచాలా.. కొందరిని తీసేసి మరికొందరికి అవకాశం ఇవ్వాలా.. పదోన్నతులు ఏమైనా అవసరమా అనే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తామేం చేశామన్న విషయాన్ని మంత్రులంతా ఎవరికి వారు ప్రజంటేషన్ల రూపంలో ప్రధానికి వివరించాల్సి ఉంటుంది. ఎవరికి వారు ఇచ్చుకునే ఈ ప్రోగ్రెస్ కార్డుల ఆధారంగానే మంత్రుల తలరాతలు నిర్ణయం అవుతాయి. ఇందుకోసం గురువారం మధ్యాహ్నం మోదీ తన మంత్రులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మార్పు చేర్పుల విషయమై ఇప్పటికే బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీ దాదాపు 5 గంటల పాటు భేటీ అయ్యారు. కొంతమంది మంత్రుల శాఖలు మారుస్తారని, కొత్తగా కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. జూలై 6వ తేదీన ప్రధానమంత్రి ఆఫ్రికా పర్యటనకు వెళ్తున్నందున ఆలోపే మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయంటున్నారు. జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో ఈలోపే కొత్త సర్కారు రూపొందుతుంది. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్లకు కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇక న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు పెద్దగా మార్కులు పడే అవకాశం లేదు. దాంతో ఆయనకు సహాయంగా ఉండేందుకు ఓ బలమైన మంత్రిని కేటాయించొచ్చని చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని సహా మొత్తం 83 మందికి మించకూడదు. ప్రస్తుతం 66 మంది ఉన్నారు. వారిలో 12 మంది యూపీకి చెందినవారే. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం అలాగే కొనసాగించే అవకాశం ఉంది.