
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ నుంచి మరో సీనియర్ నేత కారెక్కనున్నట్లు సమాచారం. సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం నామా, కేసీఆర్‌ను కలవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అంతేకాక ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామాను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్‌ఎస్ అధిష్టానం ఖమ్మం అభ్యర్థిగా నామా పేరును జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే నామా పేరును అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా ఈ విషయం గురించి ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీచేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment