సాక్షి, విజయవాడ: విఖ్యాత నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, ప్రార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబీకుల్లో అధికులు సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి శ్రద్ధాంజలిఘటించారు. విజయవాడలో సీఎం చంద్రబాబు.. రెండో రోజు మహానాడుకు వెళుతూ.. దారిమధ్యలో పటమట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి సరిపెట్టారు. కాగా, ఎన్టీఆర్ జయంతి నాడు కూడా మహానాడులో చంద్రబాబు భజనే వినిపించడం గమనార్హం.
లోకేశ్ ట్వీట్.. ఆసక్తికర వ్యాఖ్యలు: ‘జయంతి శుభాకాంక్షలు’ చెప్పడంలో (గతంలో)సంచలనాలు సృష్టించిన నారా లోకేశ్.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒకింత జాగ్రత్త వహించారు. ‘‘సామాన్యుడిగా పుట్టి కఠోరశ్రమ, క్రమశిక్షణలు కలబోసిన ఆకర్షణీయ వ్యక్తిత్వంతో, ప్రతిభతో సమాజాన్ని అత్యంత ప్రభావితం గావించిన అసామాన్యులు నందమూరి తారకరామారావుగారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక మహానాడులో ప్రసంగించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ రోజుల్లో నాన్నగారు ఏమనేవారంటే..: ‘‘చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా నాన్న నన్ను ఊరికి పంపేవారు. అలా పంపేటప్పుడు.. ‘పల్లెకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్లే..’ అని పదేపదే గుర్తుచేసేవారు. ఆ విధంగా చిన్నవయసులోనే నాకు పంచాయితీరాజ్ మంత్రిగా పల్లెలకు సేవచేసే అవకాశం దక్కింది. స్వాతంత్ర్యం తరువాత 70 ఏళ్లలో చేయలేని పనులన్నీ గడిచిన 4ఏళ్లలో పూర్తిచేశాం. మేము వేసిన సీసీ రోడ్ల మీద ప్రతిపక్ష నాయకులు నడుస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్న నాపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాళ్లకు దమ్ము,ధైర్యం ఉంటే.. నేను ఎక్కడ, ఎలా తప్పు చేశానో ఆధారాలతో సహా నిరూపించాలి. తన సొంత నియోజకవర్గంలో కట్టాల్సిన సుజల స్రవంతి పథకాన్ని ఉద్దానంకు తరలించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది. ఆయన 68 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా పరుగులు పెడుతున్నారు. 32 ఏళ్ల యువకుడినైన నేనే ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నాను.. ’’ అని లోకేశ్ చెప్పుకొచ్చారు.
సామాన్యుడిగా పుట్టి కఠోరశ్రమ, క్రమశిక్షణలు కలబోసిన ఆకర్షణీయ వ్యక్తిత్వంతో, ప్రతిభతో సమాజాన్ని అత్యంత ప్రభావితం గావించిన అసామాన్యులు నందమూరి తారకరామారావుగారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం.
— Lokesh Nara (@naralokesh) 28 May 2018
Comments
Please login to add a commentAdd a comment