
సాక్షి, అమరావతి: దారుణ ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం నేతల్లో మార్పు కనిపించడంలేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఉండవల్లిలోని ప్రజావేదికను టీడీపీ పార్టీ కార్యాలయంలా వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజావేదికలో రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్నికల సయమంలో కోడ్‌ను ఉల్లంఘించి యధేచ్చగా అందులోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఆదివారం రాత్రి కూడా మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ప్రజావేదికలోనే నిర్వహించారు. ప్రజలను సందర్శించేందుకు తనకో భవనం కావాలని తన ఇంటి పక్కనే సీఆర్‌డీఏ నిధులతో చంద్రబాబు ప్రజావేదికను కట్టించారు. కానీ ఏ ఒక్కరోజూ అందులో ప్రజలు, సందర్శకులను కలవకపోగా పూర్తిగా టీడీపీ కార్యాలయంలా మార్చి వేశారు. అధికారాన్ని కోల్పోయాక కూడా ఆయన కుమారుడు అక్కడే పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తా
వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని లోకేశ్ చెప్పారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం రాత్రి మంగళగిరి కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో నియోజకర్గంలో పర్యటిస్తానని తెలిపారు. ఓటమిపై తాను బాధపడటంలేదన్నారు.
ముఖ్య నాయకులతో చంద్రబాబు మంతనాలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్ తదితరులతో సమావేశమైన ఆయన ఫలితాలు ఇలా ఉంటాయని తాను ఊహించలేదని, ప్రజలు తనను ఎందుకు తిరస్కరించారో అర్థం కావడంలేదని అన్నట్లు తెలిసింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన కలవడం తదితర అంశాలపై చర్చించారు. మంగళవారం గుంటూరులో నిర్వహించనున్న ఎన్టీఆర్ జయంతి ఏర్పాట్లపై మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment